దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధ వాకర్ హత్యకేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తన లివ్ ఇన్ పార్ట్ నర్ శ్రద్ధను తానే హతమార్చినట్లు అఫ్తాబ్ అమీన్ పూనావాలా కోర్టులో అంగీకరించాడు. కానీ.. తాను ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదని, ఆవేశంలో అలా జరిగిపోయిందని వివరించాడు. పోలీసులకు తాను అన్నివిధాలా సహకరిస్తానన్నాడు. ఇద్దరి మధ్య గొడవ, మాటమాట పెరగడంతో కోపంలో హత్య చేసినట్లు వెల్లడించాడు.
కానీ.. హత్య జరిగి ఆర్నెల్లు గడిచిపోయిందని, అప్పుడు ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా తనకు గుర్తులేదన్నాడు. కానీ.. అఫ్తాబ్ తన నేరాన్ని కోర్టులో అంగీకరించినా దానిని సాక్ష్యంగా పరిగణించడం వీలుకాదని నిపుణులు చెబుతున్నారు. ఇది రిమాండుకు సంబంధించిన విచారణ కాబట్టి, కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెప్పినప్పటికీ అఫ్తాబ్ నేరాంగీకారం చెల్లదన్నారు. మరోవైపు.. హత్యజరిగి చాలారోజులు కావడంతో వాటి ఆధారాలను సేకరించడం కష్టతరంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. శ్రద్ధ హత్యకు ఉపయోగించిన కత్తి ఇంకా దొరకలేదని కోర్టుకు తెలిపారు.
ఆమె హత్యకు గల ప్రధాన కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదన్నారు. అఫ్తాబ్ చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవన్నారు. ఈ హత్యకేసులో డిజిటల్ ఆధారాల సేకరణ దిశగా దర్యాఫ్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.