Friday, November 22, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimnagar: ఆల్ ఫోర్స్ పాఠశాల ఉపాధ్యాయులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Karimnagar: ఆల్ ఫోర్స్ పాఠశాల ఉపాధ్యాయులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

పరిమితికి మించి ప్రయాణం చేయడమే కారణమా?

పాఠశాల బస్సులు పూర్తి ఫిట్నెస్ కలిగి ఉండాలని పరిమితికి మించి విద్యార్థులను బస్సులలో తరలించవద్దని ప్రభుత్వ యంత్రాంగం పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నాయి. అందుకు నిదర్శనంగా ఈ సంఘటన చెప్పవచ్చు.
విద్యార్థులను తీసుకెళ్లాల్సిన అల్ఫోర్స్ పాఠశాల బస్సు లో పరిమితికి మించి ఉపాధ్యాయులను తీసుకెళ్తుండడంతో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన రామడుగు మండలంలో చోటుచేసుకుంది.

- Advertisement -

స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్రావుపేట ,వెధిర గ్రామాలలో గల అల్ఫోర్స్ పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలలో పనిచేసేందుకు కరీంనగర్ నుండి నిత్యం సుమారు 70కి పైగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులను తీసుకొచ్చే బస్సులోనే వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం ఉదయం రెండు పాఠశాలలకు వచ్చిన ఉపాధ్యాయులు పాఠశాల ముగించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి కరీంనగర్ వెళ్తున్న సమయంలో విద్యార్థులను తీసుకెళ్లాల్సిన బస్సులో పరిమితికి మించి సుమారు 70 మందికి పైగా ఉపాధ్యాయులు అందులో ప్రయాణిస్తుండడంతో దేశరాజు పల్లి శివారులో బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టినట్లు చెప్పారు. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ప్రమాదానికి కారణం ముమ్మాటికి పరిమితికి మించి ఉపాధ్యాయులను తరలిస్తుండమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు.

లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న అల్ఫోర్స్ యాజమాన్యం ఉపాధ్యాయులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉండగా విద్యార్థులను తీసుకెళ్లే బస్సులోనే ఉపాధ్యాయులను తరలిస్తుండటమే ప్రమాదానికి కారణమని మండిపడుతున్నారు. ఫీజులు వసూలు చేయడంలో చూపే శ్రద్ధను ఉపాధ్యాయులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడంలో చూపడం లేదని మండిపడుతున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో ఉపాధ్యాయులను తరలిస్తుండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫిట్నెస్ కలిగి ఉన్న బస్సులలో పరిమితికి మించి విద్యార్థులను తరలించవద్దని ఒకపక్క ఆదేశాలు జారిచేస్తున్న అల్ఫోర్స్ పాఠశాల యజమాన్యం ప్రభుత్వ నిబంధన ఉల్లంఘించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఉపాధ్యాయులకు ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారుల పైన ఉందన్నారు. ఇప్పటికైనా అల్ఫోర్స్ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులను తరలించే బస్సులలో ఉపాధ్యాయులను అనుమతించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాల నిర్లక్ష్య వైఖరి పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News