జడ్చర్ల మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం కావేరమ్మపేట మున్సిపల్ కార్యాలయంలో సాదాసీదాగా ముగిసింది. ఉన్నతా ధికారులు, ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాకపోవటంతో తక్కువ సమయంలోనే ముగించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 ఏడాదికి సంబంధించి అంచన రూ. 40.11 కోట్ల బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే బడ్జెట్ సరిపోదని, పెంచాల్సిన అవసరం ఉందని సభ్యులు సూచనలు చేశారు.
మొదట 2023-24 ఏడాదికి సంబంధించి సవరణ బడ్జెట్ రూ.20.43 కోట్లను సభ్యులు ఆమోదించారు. వీటిలో సవరణ అంచనా ఖర్చు రూ.18.12 కోట్లు 2024 ఏడాదికి రూ.2.03 కోట్లను ప్రారంభ నిల్వగా చూయించారు. ఇక 2024 ఏడాది అంచన ఆదాయం రూ. 21.47 కోట్లుగా చూయించగా, అంచనా ఖర్చు రూ. 21.30 కోట్లుగా చూయిం చారు. పన్నుల ద్వారా రూ.6.50 కోట్లు రాబట్టాలని పేర్కొన్నారు. పన్నేతర ఆదాయం రూ.15 కోట్లుగా ఉండగా సిబ్బంది జీత భత్యాలకు రూ. 5కోట్లు, పారి శుద్ధ్య నిర్వహణ ఖర్చులు రూ. 2.60 కోట్లు, కరెంట్ బిల్లులకు రూ. 1.02 కోట్లు, హరితహారం కోసం కేటాయించిన బడ్జెట్ రూ. 2.04 కోట్లు ఇతర ఖర్చులకు రూ. 5.48 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటు రూపంలో రూ. 40.11 కోట్లు వస్తుందని అంచనా వేశారు. బడ్జెట్ ద్వారా ప్రతి వార్డులోనూ రూ.2 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టాలని చైర్ పర్సన్ సభ్యులకు తెలియజేశారు. అయితే గత మూడేళ్లుగా కొన్ని వార్డుల్లో రూ. కోట్లల్లో పనులు అయ్యాయని, మరికొన్నింటిల్లో అసలు పనులే కాలేదని పేర్కొర్నారు. పనులు చేపట్టని వార్డులకు అధిక బడ్జెట్ ఇవ్వాలని సభ్యులు కోరారు. మున్సిపాలిటీ పరిధిలో అనుమతిలేని నిర్మాణాలు చాలా జరుగుతున్నాయని వాటిని పట్టించుకోవటం లేదని, అన్నింటిని సర్వే చేసి పన్నులు విధిస్తే ఆదాయం భారీగా పెరుగుతుందని సభ్యులు సభకు వివరించారు. అదే విధంగా చైర్ పర్సన్, కమిషనర్, సభ్యులతో కలసి మున్సిపాలిటీలో తనిఖీలు నిర్వహించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.
మున్సిపల్ కమిషనర్ ఎప్పుడు ఎక్కడకు వెళ్తున్నారో సమాచారం ఇవ్వటం లేదని కొందరు సభ్యులు ఆరోపించగా తనకూ సమాచారం ఇవ్వటం లేదని చైర్ పర్సన్ తెలిపారు. కాగా తాను సభ్యులు ఆమోదించిన పనులు చేయటం బాధ్యతగా వ్యవహరిస్తానని, ఎక్కడకు వెళ్లేది చెప్పాల్సిన అవసరం లేదని కమిషనర్ రాజయ్య సభకు తెలి పారు. అంచనా బడ్జెట్ మున్సిపాలిటీ అవసరాలకు ఏమాత్రం చాలటం లేదని, ఇతర ప్రాంతాల వాళ్లు వచ్చి ఇక్కడ నివాసం ఉండటం వల్ల స్థానికులు చాలా నష్టపోతున్నారని, ఇతరులు వ్యాపారాలు చేసుకుంటూ పన్నులు చెల్లించకుండా ఉన్నారని వారిపై దృష్టిసారించాలని సభ్యులు తెలిపారు. బడ్జెట్ ఆమోదంపై వచ్చే జనరల్ బాడి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక, కౌన్సిలర్లు పాల్గొన్నారు.