Friday, November 22, 2024
Homeఫీచర్స్Royal sisters: రాయల్‌ సిస్టర్స్‌..సరికొత్త ప్రయోగం

Royal sisters: రాయల్‌ సిస్టర్స్‌..సరికొత్త ప్రయోగం

ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరూ రాయల్‌ సిస్టర్స్‌ అక్షితా ఎం.భాంజి డియో, మ్రుణాళికా ఎం.భాంజి డియోలు. వీళ్లు భాంజా రాజవంశానికి చెందిన 47వ రాజు ప్రవీణ్‌ చంద్ర భాంజ్‌ డియో కూతుళ్లు. ఒరిస్సాలోని మయూర్‌ భంజ్‌ రాజవంశస్థులు. ఈ ఇద్దరూ ఒరిస్సా చరిత్ర, సంస్కృతి, కళాక్రుతులు, వారసత్వ సంపదను ప్రతిఫలించేలా ఒరిస్సా బరిపాడా టౌన్‌లో ఉన్న తమ బెల్‌ గాడియా రాజభవనాన్ని తీర్చిదిద్ది ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చారు. అందమైన పర్యాటక ప్రదేశంగా, బోటిక్‌ ప్యాలెస్‌ హోటల్‌గా తీర్చిదిద్దారు. ఆ జిల్లాలో ఎకో- టూరిజానికి బాటలు వేశారు. వినూత్న ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు..
ఈక్విస్ట్రియన్‌ సోర్ట్‌, షోజంపింగ్‌లో ఈ రాయల్‌ సిస్టర్స్‌ జాతీయస్థాయి క్రీడాకారిణులు. కాలేజీలో చదివేటప్పుడు స్విమ్మింగ్‌, బాస్కెట్‌ బాల్‌ క్రీడల్లో కూడా పాల్గొన్నారు. మ్రుణాళిక యోగా ప్రాక్టీషనర్‌ కూడా. ఆమె హఠ యోగా లో సర్టిఫైడ్ టీచర్‌. ఆరోగ్యపరంగా, జీవనశైలి పరంగా ఆర్గానిక్‌ బ్రాండ్లను ఉపయోగించడానికే మ్రుణాళిక ఇష్టపడతారు. ఆరోగ్యం, జీవనశైలి రంగాలలో పనిచేసిన ఆమె ప్రక్రుతికి దగ్గరగా తన జీవనశైలి ఉండాలని కోరుకుంటారు. ఈ రాయల్‌ సిస్టర్స్‌ మయూర్‌ భంజ్‌ ఫౌండేషన్‌ ద్వారా మార్షల్‌ ఆర్ట్‌ డాన్సుగా పేర్కొనే ఛా కళను ప్రోత్సహించడంతోపాటు అమ్మాయిలలో క్రీడల పట్ల ఆసక్తిని సైతం పెంపొందిస్తున్నారు.  మ్రుణాళిక, అక్షిత కలకత్తాలో పుట్టారు. వీళ్లు భాంజా రాజవంశానికి చెందిన 47వ రాజు ప్రవీణ్‌ చంద్ర భాంజ్‌ డియో కూతుళ్లు. తల్లి రష్మి రాజ్యలక్ష్మి భాంజ్‌ డియో జైసల్మేర్‌ రాజవంశస్థురాలు. వీరి నానమ్మ భారతి రాజ్యలక్ష్మీ దేవి నేపాల్‌ రాజు స్వర్గీయ త్రిభువన్‌ కూతురు. అయితే 1947లో రాచవంశాలన్నీ దేశంలో భాగమవడం, రాజవంశస్థులు అధికారాలను కోల్పోవడం అందరికీ తెలిసిందే. అయితే విద్యావంతులైన అక్షితా, మ్రుణాళికలు స్థానిక కళలను, ఒరిస్సా సంస్క్రుతిని ప్రతిఫలించేలా తమ ‘హోమ్‌’ ప్యాలెస్‌ను బోటిక్‌ ప్యాలెస్‌ హోటల్‌గా తీర్చిదిద్దడానికి పూనుకున్నారు. ఒరిస్సాలో ఎకో టూరిజం అభివ్రుద్ధి చేసే పనికి వినూత్న రీతిలో బీజం వేశారు. వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకమైన లా మార్టినైర్‌ ఫర్‌ గర్ల్‌లో తొమ్మిది, పది చదివారు. తర్వాత  బాగా సంపన్నులు చదివే సింగపూర్‌లోని యునైటెడ్‌ వరల్డ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ ఇద్దరూ రాయల్‌ సిస్టర్స్‌కు అంతర్జాతీయ అంశాల పట్ల, టూరిజం, సస్టైనబిలిటీ, ఎంటర్‌ ప్రెన్యూర్షిప్‌, పాలసీల వంటి అంశాలపై ఆసక్తి ఎక్కువ. డేవిస్‌ స్కాలర్లుగా  యుఎస్‌ లోని బార్డ్‌ కాలేజ్‌ అ్‌ండ యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియాలో చేరారు. అక్షిత పొలిటికల్‌ సైన్స్‌, హ్యూమన్‌ రైట్స్‌ కోర్సులను చదివితే, మ్రుణాళిక సోషియాలజీ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అధ్యయనం చేశారు. 
 గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత మ్రుణాళిక బార్సిలోనాలో చేస్తున్న ఫ్యాషన్‌ అండ్‌ ఫ్రాగ్రెన్స్‌ కుటుంబ బిజినెస్‌లో చేరితే, అక్షితా సిరియన్‌ శరణార్థుల సంక్షోభంపై పనిచేస్తున్న హ్యుమానిటేరియన్‌ ఎయిడ్‌ ఆర్గనైజేషన్‌ ఇంటర్నేషనల్‌ రెస్క్యూ కమిటీలో చేరారు. ఒరిస్సాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రొఫెషనల్‌ అనుభవం రాయల్‌ సిస్టర్స్‌ ఇద్దరికీ ఎంతగానో ఉపయోగపడింది. అలా ఈ రోజు 200 సంవత్సరాల నాటి బెల్గాడియా రాజభవన హోటల్‌కు డైరక్టర్సుగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి ఇద్దరూ ఎదిగారు.
వీరి తల్లిదండ్రులు మయూర్‌ భంజ్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఆరోగ్యం, కళలు, క్రీడలు, జీవనోపాధి రంగాలలో స్థానిక కమ్యూనిటీ ప్రజలకు అండదండలు అందిస్తున్నారు. డోక్రా హ్యాండీక్రాఫ్ట్‌కు పేరొందిన గ్రామాల ప్రజలతో కూడా రాజభవనానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు రకాల వ్యాపార కార్యకలాపాల ద్వారా అక్కడి కమ్యూనిటీ ప్రజలకు జీవనోపాధి కల్పించడంతో పాటు ఎకో టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలను  రాజవంశస్థులు కల్పిస్తున్నారు. అంతేకాదు  స్థానిక ప్రజలకు లబ్దిని కలిగించే పలు సామాజిక, పర్యావరణ ప్రాజక్టుల్లో కూడా ఈ రాచకుటుంబం పాలుపంచుకుంటోంది.
ఇదంతా బానే ఉందన్న త్రుప్తి వారికి ఉన్నా, ఒకప్పుడు పలు సాంస్క్రుతిక కార్యక్రమాలతో ఎంతో సందడిగా ఉండే బెల్గాడియా రాజభవనం ఆ వైభవాన్ని కోల్పోవడం రాయల్‌ సిస్టర్స్‌కు ఎంతో లోటుగా అనిపించింది. ఆ శోభను రాజప్రాసాదానికి తిరిగి తెచ్చి దానిని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుందని భాంజ్‌ డియో రాయల్‌ సిస్టర్స్‌ మదిలో మెదిలింది. ‘ఒరిస్సా సంస్క్రుతి, వారసత్వసంపదకు ప్రతీకగా ఆ ప్యాలెస్‌ను మరింత పునరుద్ధరించాలని మేం భావించాం’ అని రాయల్‌ సిస్టర్స్‌ అన్నారు. 2015లో ఈ ఆలోచన వారికి వచ్చింది.ఆ వెంటనే తమ ఉద్దేశాన్ని తల్లిదండ్రుల ముందు వాళ్లు పెట్టడం, వారు దానికి అంగీకరించడం జరిగిపోయింది. అలా ఈ ప్రాజక్టు చేపట్టి తమ కలకు వాస్తవ రూపును ఇచ్చారు అక్షిత, మ్రుణాళికలు.
ప్యాలెస్‌ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఇధ్దరూ పూనుకున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతం అభివ్రుద్ధి కూడా సాధ్యమవుతుందని భావించారు. ప్యాలెస్‌ను స్థానిక సంస్క్రుతీ, కళలు, వారసత్వ సంపదను ప్రతిబింబించే బోటిక్‌ హోటల్‌గా మలచాలనుకున్నారు. అయితే మయూర్‌ భంజ్‌ రెడ్‌ కారిడార్‌ పరిధిలో ఉండడంతో పర్యాటకులను ఆకట్టుకునేలా ప్యాలెస్‌ను బోటిక్‌ హోటల్‌గా తీర్చిదిద్దడం పెనుసవాళ్లతో కూడుకున్నదని ఇద్దరూ సోదరీమణులు గ్రహించారు. అయినా కూడా జంకకుండా ఐదు సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రాజక్టును వీరిద్దరూ పట్టుదలతో భుజాలకు ఎత్తుకున్నారు. ‘ప్యాలెస్‌ ప్రాచీన సౌందర్యాన్ని, సొబగులను కాపాడుతూనే అందులో వైఫై, విద్యుత్‌ పరమైన అత్యాధునిక సదుపాయాల కల్పనకు డిజైన్‌ చేశాం. హోటల్‌ డెకోర్‌, స్టైల్‌ రాజభవనపు ఆర్కిటెక్చర్‌ రూపురేఖలు కలిగి ఉండేలా చూసుకున్నాం. ఆ ప్యాలెస్‌ మూలనిర్మాణం చెదరకుండా, దెబ్బతినకుండా చూశాం. అంతేకాదు అందులోని ఫర్నీచర్‌ సైతం వంద సంవత్సరాల క్రితం నాటిది. అలాగే రాజభవనంలోని కార్పెట్లు, షాండ్లియర్లు కూడా ఎన్నో సంవత్సరాల నాటివి. అవన్నీ రాజప్రసాదంలోని ఒకప్పటి చరిత్ర, వారసత్వ వైభోగాలను ప్రతిఫలించే గొప్ప కళాఖండాలు. ఉదాహరణకు రాజభవనంలోని లైబ్రరీలో వినైల్‌ రికార్డు ప్లేయర్లు, లెక్కలేనన్ని తొలి ముద్రణా గ్రంథాలు మీకు దర్శనమిస్తాయి. మేం అనుకున్న ప్రకారం ప్యాలెస్‌ పునరుద్ధరణను 2019 నాటికి పూర్తిచేశాం. అలా పునరుజ్జీవం సంతరించుకున్న బెల్‌ గాడియా ప్యాలెస్‌ అప్పటి నుంచి అతిథులకు తెరిచాం అని మ్రుణాళిక తెలిపారు.
ఈ బోటిక్‌ ప్యాలెస్‌ అడుగడుగునా ప్రతిఫలించే కళాత్మకత, ఆర్కిటెక్చర్‌ సొబగులు పర్యాటకులను అబ్బురపరిచేలా ఉంటాయి. రాజభవనంలో అడుగుపెట్టగనే విశాలమైన సుందర ఉద్యానవనాలు, పెద్ద పెద్ద దారులు, ఎత్తైన పోర్చి కనిపిస్తాయి. ఈ ప్యాలెస్‌లో పదకొండు విశాలమైన గదులు ఉన్నాయి.  గోడలకు శతాబ్దాల నాటి రాయల్‌ శోభను ప్రతిఫలించే తైలవర్ణ చిత్రాలు వేళ్లాడుతూ కనిపిస్తాయి. గదుల్లో అడుగడుగునా రాజరికపు దర్పం, శోభ కనిపిస్తుంటాయి. బెల్‌ గాడియా రాజభవనంలో భోజనం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. స్థానికంగా ఉండే చెఫ్‌లు చేసిన ఒడియా తాళీలు అందులో కొలువుదీరి ఉంటాయి. వీటిల్లో చిరుధాన్యాలతో చేసే పదార్థాల రుచులు అద్భుతంగా ఉంటాయి. విందులో ఒరియా సంస్క్రుతి జాలువారుతుంటుంది. ఆ ప్యాలెస్‌లో అణువణువునా సౌందర్యం, ఉల్లాసం, ఉత్సాహం తొణికిసలాడుతుంది. మార్షల్‌, జానపద సంస్కృతుల సమ్మేళనమైన స్థానిక కళ చాను కళాకారులు ప్రదర్శిస్తారు. సాయంత్రాలు స్థానిక డోక్రా కళాకారులు చేసిన కళారూపాలు పర్యాటకులను అలరిస్తాయి. సబై అనే గడ్డితో స్థానిక మహిళలు తయారుచేసిన బుట్టలు, ట్రేలు, బౌల్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌ వంటి ఎన్నో వస్తువుల్లో ఒడిస్సా  కళా సౌందర్యం ఉట్టిపడుతుంటుంది. సాహసాలు ఇష్టపడే పర్యాటకులకు వాటిని ఆస్వాదించడానికి ప్యాలెస్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో సింమ్లిపాల్‌ ఎలిఫెంట్‌, టైగర్‌ రిజర్వులు ఉన్నాయి. జులై మాసంలో అక్కడ జరిగే జగన్నాథ రథోత్సవం చూసి ఆనందించాల్సిన అద్భుతమైన కార్యక్రమం అని రాయల్‌ సిస్టర్స్‌ తెలిపారు.
ఇపుడు ఈ ప్యాలెస్‌ చూడడానికి పలు యూరప్‌ దేశాలు, జపాన్‌, కెనడా, అమెరికా, బ్రిటన్‌ వంటి  దేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తున్నారని రాయల్‌ సిస్టర్స్‌ తెలిపారు. అయితే ఇక్కడ చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. వారసత్వ సంపద అంటే కమ్యూనిటీల జీవనశైలికి అద్దంపట్టేది. దాన్ని మరింతగా వ్రుద్ధి చేయాల్సి ఉందని ఈ సిస్టర్స్‌ అంటారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మా కలను పూర్తిగా సాకారం చేసుకోవడానికి టూరిజం ద్వారా మేం ఇంకా క్రుషి చేయాల్సి ఉంది అన్నారు అక్షితా, మ్రుణాళి కలు. పునరుద్ధరణ పని ఎంతో సవాలుతో కూడుకున్నది. అంతేకాదు ఈ ప్రాంతంలో వాతావరణం తరచూ తీవ్ర మార్పులకు గురవుతుంటుంది. ఇలాంటి చోట ఎన్నో సంవత్స రాల నాటి భవనాల పునరుద్ధరణ, పరిరక్షణలతో పాటు వాటిల్లో ఆధునిక వసతులు కల్పించడం పెను సవాళ్లతో కూడిన పని అంటారు ఈ సోదరీమణులు. వీటిని విజయవంతగా పూర్తిచే యగలిగితే పర్యాటకం వ్రుద్ధి చెందుతుంది. స్థానిక ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ లక్ష్యంతోనే  ఈ సోదరీమణులు చేపట్టిన క్రుషి , ప్రయత్నాలు ఎంతైనా ఆహ్వానించదగి నవనడంలో సందేహం లేదు. బెల్గాడియా రాజభవన పునరుద్ధరణ ప్రాజక్టు తమ జీవితలక్ష్యాన్ని సాధించిన సంత్రుప్తిని ఇస్తోందని  రాయల్‌ సిస్టర్స్‌ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News