Yuvraj Singh : నిబంధనలు పాటించకుంటే ఎవ్వరైనా మాకు ఒకటే అని చెబుతోంది గోవా టూరిజం శాఖ. టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్ కాలే పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. అధికారుల అనుమతి లేకుండానే యువీ తన విల్లాను అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో ప్రకటన ఇవ్వడమే ఇందుకు కారణం.
గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవాలో హోమ్ స్టే(పెయింగ్ గెస్ట్) ఇవ్వాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. యువరాజ్ సింగ్‌కు గోవాలో కాసా సింగ్ పేరిన ఓ విలాసవంతమైన విల్లా ఉంది. ఈ విల్లాను టూరిస్టులకు అద్దెకు ఇచ్చేందుకు యువీ ఇటీవల ఆన్లైన్లో ప్రకటన ఇచ్చాడు. ఎలాంటి అనుమతులు లేకుండా యువీ విల్లాను అద్దెకు ఇవ్వడంపై టూరిజం శాఖ నోటీసులు జారీ చేసింది. ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలంటూ, డిసెంబర్ 8న ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.