తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15 ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని, ఉద్యమంతో పాటు పాలనలో తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సివున్నదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
నాడు ఉద్యమ కేతనమై ఎగిరి..
ఆరు దశాబ్దాలపాటు దిక్కు మొక్కు లేక ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి చేర్చేందుకు నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెప రెపలు., తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దాకా, కాంగ్రేస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణ ను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కిటకిట..
తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…” తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు..” అని పునరుద్ఘటించారు.
ఇది ఊహించని తీర్పు
“తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్ర లోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. “పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది” అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ వివరించారు.
ప్రజల మనసుల్లో రికార్డ్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగునీరు,విద్యుత్ సరఫరా కాట్లేవన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రేస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
దిగజారిన పాలన..
“ తెలంగాణ కోసం సాగిన మన 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. నాడు ఎన్టీఆర్ ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ అధినేత ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని విశ్లేషించారు.
లీడర్లు వస్తుంటరు, పోతుంటరు..
పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీ లోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని సందర్శకుల చప్పట్లు నడుమ ప్రకటించారు. బిఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రేస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బిఆర్ఎస్ ను ఆదరిస్తారని అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపైన దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత పిలునిచ్చారు.
నియోజకవర్గాల వారిగా వరుస భేటీలు..
కాగా… ఎంపికచేసిన నియోజక వర్గాలవారీగా ముందస్తు సమాచారంతో నిర్దేశిత సమయం ప్రకారం అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు నేతలతో అధినేత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇంచార్జీలకు ఇచ్చిన సమయం మేరకు అధినేతతో నియోజక వర్గాల వారీగా వరుస సమావేశాలు కొనసాగనున్నాయి.
ఇందులో భాగంగా తమ అధినేతను కలిసేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. సందర్శకుల సందడి గురువారం కూడా కొనసాగింది. ముందస్తు సమాచారం మేరకు ఆర్మూర్, హుజూరాబాద్ నియోజక వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు వందలాదిగా ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి తరలివచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.