Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్international plastic bag free day 2024: జూలై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల...

international plastic bag free day 2024: జూలై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నివారణ దినోత్సవం

ప్లాస్టిక్ సంచులతో అనర్థాలు:

ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్ సంచులు వినియోగించబడుతున్నాయి. ఇదే వినియోగ విధానాలు వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో దాదాపు పన్నెండువందల కోట్ల టన్నులకు పైగా ప్లాస్టిక్ చెత్త ఉంటుంది అని ఐక్యరాజ్యసమితి నివేదికలు చెపుతున్నాయి. 2021 నుండి ప్లాస్టిక్ వ్యర్థాలు 7.11శాతం పెరిగాయి. 2024లో 220 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏర్పడతాయని ప్లాస్టిక్ ఓవర్‌షూట్ డే 2024 నివేదిక తెలిపింది. ప్లాస్టిక్ ఓవర్‌షూట్ డే అనేది పర్యావరణ కాలుష్యానికి దారితీసే ప్రపంచాన్ని నిర్వహించగల సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాల మొత్తాన్ని సూచిస్తుంది. 2024లో, గ్లోబల్ ప్లాస్టిక్ ఓవర్‌షూట్ డే సెప్టెంబర్ 5న జరుగుతుందని అంచనా వేయబడింది. చైనా, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, జపాన్ దేశాలు 51 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తాయని ఈ నివేదిక తెలిపింది. భారతదేశం 3,91,879 టన్నుల మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తుందని, ప్రపంచంలో చైనా (787,069 టన్నులు) తర్వాత జలవనరుల కాలుష్యంలో రెండవ అగ్రగామిగా నిలుస్తుందని స్విస్ ఎర్త్ యాక్షన్ విశ్లేషణలో తేలింది.
2008లో కేవలం ప్లాస్టిక్ బ్యాగ్‌లు మరియు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ నిషేధం ద్వారా ‘ప్లాస్టిక్ రహిత’ దేశంగా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా రువాండా నిలిచింది.

- Advertisement -

ప్లాస్టిక్ సంచి చరిత్ర:
1930 ప్రారంభంలో ఇంగ్లాండ్‌లోని నార్త్‌విచ్‌లోని ఒక రసాయన కర్మాగారంలో అనుకోకుండా పాలిథిలిన్‌ను సృష్టించినప్పుడు సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్‌ ఆవిర్భవించింది. మొదట సారిగా దీనిని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం వారి చేతి తొడుగలకోసం రహస్యంగా ఉపయోగించారు.
1965 నాటికి పాలిథిలిన్ షాపింగ్ సంచులపై స్వీడిష్ కంపెనీ సెల్లోప్లాస్ట్ పేటెంట్ పొందింది. ఇంజనీర్ స్టెన్ గుస్టాఫ్ తులిన్ రూపొందించిన ప్లాస్టిక్ బ్యాగ్ యూరోప్‌లో వస్త్రం మరియు ప్లాస్టిక్‌ను భర్తీ చేసింది. ఐరోపాలో 80 శాతం బ్యాగ్ మార్కెట్‌ను నియంత్రించిన తర్వాత ప్లాస్టిక్ సంచులు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. 1979 సం. వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్‌లో విరివిగా ఉపయోగించబడ్డాయి. ప్లాస్టిక్ కంపెనీలు సంచులను కాగితం, పునర్వినియోగ సంచుల కంటే అధికంగా విక్రయించడం ప్రారంభించాయి. 1997లో సముద్ర పరిశోధకుడు చార్లెస్ మూర్ 1.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తేలియాడే ప్లాస్టిక్ చెత్త గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ కనుగొన్నారు. 2019 నాటికి ప్లాస్టిక్ భూగోళం అంతటా వ్యాపించింది. మరియానా ట్రెంచ్‌లో సముద్రపు ఉపరితలం నుంచి 35,849 అడుగుల దిగువన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కణాలు కనిపించాయి.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ?
ఒక్కసారి మాత్రమే ఉపయోగించిన తర్వాత పారవేసే ప్లాస్టిక్ వస్తువులును సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటారు. ఇవి 50 మైక్రాన్లు కంటే తక్కువ మందం కలిగి ఉంటాయి. వాటిని డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వీటిని ప్యాకేజింగ్‌లో ఉపయోగిస్తారు. వీటిలో కిరాణా సంచులు, ఆహార ప్యాకేజింగ్, సీసాలు, స్ట్రాస్, కంటైనర్లు, కప్పులు, కత్తిపీట లాంటివి ఉన్నాయి. చాలా ప్లాస్టిక్‌లు నేలలో కలవవు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయి క్షీణించడానికి సుమారు 700 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. నెమ్మది నెమ్మదిగా మైక్రోప్లాస్టిక్స్ అని పిలువబడే చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమవుతాయి. ఏటా మిగిలిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తుండగా మరో 12 శాతం వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. మిగిలిన 79శాతం వ్యర్థాలు భూమ్మీద, సముద్రంలోనూ ఏటేటా మేటలుగా పేరుకుపోతున్నాయి.
సముద్ర పర్యావరణంతో సహా భూసంబంధమైన, జల జీవావరణ వ్యవస్థలపై చెత్తతో నిండిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల వచ్చే కాలుష్యాన్ని పరిష్కరించడం అన్ని దేశాలను ఎదుర్కొంటున్న ముఖ్యమైన పర్యావరణ సవాలుగా మారింది.

బంగ్లాదేశ్ దేశం మొదటిది :
2002లో వినాశకరమైన వరదల సమయంలో డ్రైనేజీలకు ప్లాస్టిక్ సంచులు అడ్డుకుంటున్నాయని సన్నని ప్లాస్టిక్ సంచులపై నిషేధాన్ని అమలు చేసిన మొట్టమొదటి దేశంగా బంగ్లాదేశ్ ప్రపంచంలో నిలిచింది. అప్పటి నుండి చైనా, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, మొరాకో, కెన్యా, రువాండా, మౌరిటానియా, శ్రీలంక, పాపువా న్యూగినియా, వనాటు, అల్బేనియా, జార్జియా దేశాలు క్రమ క్రమంగా ప్లాస్టిక్ సంచులను నిషేధించాయి.

మనదేశ పరిస్థితి:
1979లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్‌లను నిషేధించిన మొదటి రాష్ట్రంగా
ఆవిర్భవించింది. అప్పటినుండి కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లను నిషేధించడానికి భారతదేశంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
2017లో దేశరాజధాని నగరం ఢిల్లీలో బ్యాగ్‌లు, కత్తులు, కప్పులు, ప్లేట్‌లతో కూడిన నిషేధాన్ని ఆమోదించింది. మనదేశంలో 1 జూలై 2022 నుండి దేశవ్యాప్తంగా తక్కువ వినియోగం, అధిక చెత్తను పోసే అవకాశం ఉన్న గుర్తించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధించింది.
నిషేధిత వస్తువుల జాబితాలో ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్ బడ్స్, బెలూన్‌లకు ప్లాస్టిక్ కర్రలు, ప్లాస్టిక్ జెండాలు, క్యాండి స్టిక్స్ , ఐస్ క్రీమ్ స్టిక్స్, అలంకరణ కోసం పాలిస్టైరిన్ (థర్మోకోల్), ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు, స్వీట్ బాక్సుల చుట్టూ చుట్టడం లేదా ప్యాకింగ్ ఫిల్మ్లు, ఆహ్వాన కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్‌లు, స్టిర్రర్లు ఉన్నాయి.

పొంచి ఉన్న అనర్థాలు:
ప్లాస్టిక్ ఉత్పత్తుల నుండి వెలువడే విష రసాయనాలు మానవులు మరియు జంతువులలో అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, సరిగ్గా నిర్వహించబడనప్పుడు, తరచుగా సముద్రాలలో చేరుతాయి. అక్కడ అది సముద్ర కాలుష్యాన్ని పెంచుతుంది, సముద్ర జీవులు, పర్యావరణ వ్యవస్థలపై భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం యొక్క ప్రత్యక్ష ప్రభావాల వల్ల ప్రతి సంవత్సరం కనీసం మూడు లక్షల సముద్ర జంతువులు మరణిస్తున్నాయని అంచనా. ప్లాస్టిక్ ఉత్పత్తి, పారవేయడం, మందించడం వలన గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇది గ్లోబల్ వార్మింగ్‌కు దోహదం చేస్తుంది.

అన్ని దేశాల సహకారం అవసరం:
ప్లాస్టిక్ ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన వ్యూహాలను అనుసరించడం ద్వారా మన భూమిని ప్లాస్టిక్ రహితం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

జనక మోహన రావు దుంగ
8247045230

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News