ఒకప్పుడు 15పైసల పోస్టుకార్డు నుంచి మొదలుపెట్టి ఇప్పటి 5వేల రూపాయల పెళ్లి శుభలేఖ వరకు ఏదయినా కార్డు ఎవరికైనా చేరాలంటే ముందుగా రాయాల్సింది అవతలివాళ్ల అడ్రస్. రాయాలంటే అదేంటో మనకు తెలియాలి. కానీ, అసలు అడ్రస్ అన్నదే అడ్రస్ లేకుండా పోతున్న రోజులివి. ఒకప్పుడు కార్డులే కాదు.. మనుషులు వెళ్లాలన్నా అడ్రస్ పట్టుకునే వెళ్లేవారు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. బస్సులో వెళ్తున్నప్పుడు ఏ ఊళ్లో ఉన్నామో తెలియాలంటే అక్కడి దుకాణాల మీద అచ్చ తెలుగులో ఉన్న అడ్రస్ చూసేవాళ్లం. ఫలానా గుంటూరు బ్రాడీపేటలో ఉన్నామని, విజయవాడ వించిపేటలో ఉన్నామని చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు ఒక్కచోటా అలాంటి బోర్డుల్లేవు. శ్రీ బాలాజీ హోటల్ అన్న పేరు తప్ప, అది ఏ ఊరు, ఏ వీధి, ఏ ప్రాంతం అన్నది మచ్చుకు కూడా కనిపించట్లేదు. ఇలాంటి అంతుచిక్కని అడ్రస్‌లు, వివిధ వ్యాపార సంస్థల బోర్డులు, వాటి మీద భాష, వాటి రూపురేఖలు, పరిమాణం, కొలతలు, వాటిలో ఉన్న నిబంధనలు.. ఇలాంటి అనేక విషయాలు మనం రోజూ చూస్తూనే ఉన్నా అర్థం కావు. వాటి గురించి సవివరంగా తెలిపేందుకు “తెలుగుప్రభ” వరుస కథనాలు ప్రచురించబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి కథనం “చిరునామా గల్లంతైంది!”.