రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. తరచూ గంజాయి కేసుల్లో పట్టుబడితే పిడి యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగానే జిల్లాలో గతంలో గంజాయి కేసులలో ఉన్నటువంటి నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి, అన్ని పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ నిర్వహించి, ఇకముందు ఇలాంటి నేరాలు చేయకూడదని హెచ్చరించారు.
ఒకవేళ ఎవరైనా తిరిగి తమ నేర ప్రవృత్తిని మార్చుకోక మరల ఇలాంటి నేరాలు చేసినచో వారిపై ఎన్డిపిఎస్ పి.డి. యాక్టు కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని పరిస్థితి ఉన్న వారికి జిల్లాలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ సెంటర్ లో ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తామని, తమ చుట్టుపక్కల, ఆయా గ్రామాల్లో ఎవరైనా గంజాయికి అలవాటు పడిన పరిస్థితి ఉంటే వారి వివరాలను తెలపాల్సిందిగా సూచించారు. గంజాయి అక్రమ రవాణా చేయడంతో పాటు మత్తు పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రగ్స్,మత్తు పదార్థాలు,గంజాయి గురించిన సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గాని, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ 87126 56392 లేదా డయల్ -100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అన్నారు.