పశు సంపద అంటే రైతులకు కుటుంబ సభ్యులతో సమానం. అందుకే చాలామంది రైతు కుటుంబాలు తమ ఇంట్లో పశువులు చనిపోతే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి సంఘటనే ప్యాపిలిలోని చిన్నపూజర్ల గ్రామంలో జరిగింది.
లేగ దూడగా 19 ఏళ్ల క్రితం తమ ఇంటికి వచ్చిన ఆవు 8 లేగ దూడలను, 6 ఆవుదూడలను ఈని, రైతు వ్యవసాయ అభివృద్ధిలో ఎంతగానో సహాయపడింది. ఆ అవుతో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం. అలాంటి ఆవు అనారోగ్యంతో మరణించిందన్న వార్త తెలుసుకొని, తమ ఇంటి కుటుంబ సభ్యుడే చనిపోయినట్లుగా అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆవుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.
రైతు రాజేంద్ర కుటుంబ సభ్యులు ఆవుకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. చివరగా ఆ ఆవుకి పుట్టిన దూడలే నేడు ఎద్దులై తన తల్లి మృతదేహాన్ని ఎద్దుల బండిపై మోసుకొని వెళ్లడం చూసి,కనిపెంచిన కొడుకులే తల్లిదండ్రుల పాడే మోసేందుకు వెనకాడే ఈరోజుల్లో… ఆవుకు, స్వయంగా వాటికి పుట్టిన బిడ్డలే (ఎద్దులు) పాడే మోస్తుండడం చూసిన గ్రామస్తులు తల్లీ బిడ్డల అనుబందాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు.