పటాన్ చెరు-ఐఏడీఏ బొల్లారం రసాయన పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ ఏ కిషన్ రావు ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత అరోగ్య సమస్యలతో పోరాడుతూ ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. పటాన్చెరు కాలుష్యంపై ఆయన మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు, గ్రామస్థులు, వివిధ సంఘాలు, గ్రామస్థులతో కలిసి ప్రజాపోరాటం చేశారు.
సిటిజెన్స్ ఎగెనెస్ట్ పొల్యూషన్ (క్యాప్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కే పురుషోత్తం రెడ్డి జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి కె. చిదంబరం, పోచారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హనుమంత రెడ్డి తదితరులతో కలిసి ఈ ఉద్యమాన్ని నిర్మించారు.
చుట్టుపక్కలున్న బాధిత గ్రామాల ప్రజలను కలుపుకుని పటాన్చెర్ యాంటీ పొల్యూషన్ కమిటీ (పి.ఎ.పి.సి.) గా ఏర్పడి ప్రజా ఉద్యమాలు న్యాయపోరాటాలు చేశారు. కిషన్ రావు మృతిపై పలువురు పర్యావరణవేత్తలు సంతాపం వ్యక్తంచేశారు. పర్యావరణ ఉద్యమానికి ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తంచేశారు.
సంతాపం తెలిపిన వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, బీవీ సుబ్బారావు, బాబూరావు, సరస్వతి కవుల, డాక్టర్ విజయ్, శిల్పా కృష్ణ, సమయమంత్రి చంద్రశేఖరశర్మతో పాటు పలువురు ప్రముఖులున్నారు.