విజయవాడలో ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ బృందం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఈమేరకు ఎన్టీఆర్ ట్రస్ట్(NTR Trust) మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) ప్రకటన చేశారు. ఆమె మట్లాడుతూ తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు(Chandrababu) ముఖ్య అతిథిగా హాజరవుతారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు.
ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించారని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ సహాయం తీసుకోకుండా ముందుకు సాగుతున్నామని.. ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సాయమందించామని వివరించారు. బడ్ల్ డొనేషన్ సమాజానికి ఎంతో మంచి చేస్తుందన్నారు. ప్రతి రక్తపు చుక్క ప్రజల ప్రాణాలను కాపాడుతుందన్నారు. తలసేమియా బాధితులను ఆదుకునేందుకు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. మీరు కొన్న టికెట్స్ డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని భువనేశ్వరి వెల్లడించారు.