ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ(Rama Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న పవన్ కల్యాణ్‌కు దేవదాయ శాఖ ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని తరుచూ చెప్పే ఆయన కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎంగా కీలక పదవిలో ఉండి పాలన చేయకుండా లడ్డూలో కల్తీ పేరుతో మౌన దీక్ష చేస్తా అనడం సబబు కాదన్నారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి ఆలయాల చుట్టూ తిరిగే పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కాగా రామకృష్ణ వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు.