రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని చంద్రబాబు ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను వంచించాలని చూస్తున్నారన్న విషయం మెనిఫెస్టో చూస్తేనే అర్థమవుతోందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజి మేయర్ రాగే పరుశురాంతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డిఎ మెనిఫోస్టో, టిడిపి మెనిఫెస్టోపై ప్రత్యేక చర్చ జరుగుతోందన్నారు. ఎన్‌డిఏలో అంతర్భాగమైన టిడిపి ఒక మెనిఫెస్టో రిలీజ్ చేస్తే, ఎన్‌డిఏ ఇంకో మెనిఫెస్టో రిలీజ్ చేస్తోందన్నారు. చంద్రబాబు చెప్పే సూపర్‌సిక్స్ పథకాలకు సంబంధించిన ఏ ఒక్కటీ ఎన్‌డిఏ మెనిఫెస్టోలో లేవని, నరేంద్ర మోడికి తెలిసే చంద్రబాబు మెనిఫెస్టో రిలీజ్ చేశారా అంటూ ఆయన నిలదీశారు.
దేశవ్యాప్తంగా ఈ సూపర్‌సిక్స్ పథకాల మెనిఫెస్టో ప్రకటిస్తారా? లేదంటే బిజెపికి సంబంధం లేదా? ఒకవేళ మళ్లీ బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే చంద్రబాబు హామీలకు కేంద్రం బాధ్యత వహించదా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న రైతుభరోసాలో ఆరు వేలు కేంద్రం ఇస్తోంది. కేంద్రం ఎంత ఇస్తుంది…రాష్ట్ర వాటా ఎంత ఉంది అని బాధ్యాతాయుతంగా జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
అందరూ ఒక వేదికపైకి వచ్చి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీకే దిక్కులేదని తోపుదుర్తి గుర్తుచేశారు. టిడిపి మెనిఫెస్టో రిలీజ్ సమయంలో ఆ ప్రతిని పట్టుకోవడానికి కూడా బిజెపి ప్రతినిధి వెనుకాడుతున్నాడని, మాకు సంబంధం లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెబుతున్నాడని ఆరోపించారు. ఆ వీడియో వైరల్ అవుతోందన్నారు.
14 ఏళ్ల పాలనలో కనీసం 2 లక్షలు ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాడం నమ్మదగిందా? నిరుద్యోగులను మోసం చేయడానికి కాదా? 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశాడా? ప్రస్తుత మెనిఫెస్టో పరిశీలిస్తే ఉద్యోగులు, ప్రజలను వంచించిలాగానే ఉంది. జగనన్న 52 వేల కోట్లు ఏటా సంక్షేమ పథకాల కోసం నిధులు విడుదల చేస్తున్నాడు. ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదు. చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్క ఏడాది 10 వేల కోట్లకు మించి ఇవ్వలేదు. అలాంటి పెద్ద మనిషి ఈరోజు ఏకంగా లక్షా 50 వేల కోట్లు ఇస్తానంటున్నాడు. 2014 నుంచి 2019 వరకు ఖర్చు చేసినదానికంటే పెదిరెట్లు ఇస్తామంటున్నాడు. ఇంత సంపదను ఎక్కడి నుంచి తెస్తాడు. ఆయన అజెండా మొత్తం రాష్ట్ర సంపదను అమరావతికి తరలించేలా ఉంది.
జగనన్న గత ఐదేళ్లలో 2 లక్షల 60 వేల కోట్లు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాడు. మళ్లీ ఐదేళ్లలో అవే పథకాలు కొనసాగిస్తానంటున్నాడన్నారు. చంద్రబాబు పూర్ టు రిచ్ అంటున్నాడంటే జన్మభూమి కమిటీల సభ్యులను రిచ్ చేయడానికా? నీరు చెట్టు ద్వారా తమ కార్యకర్తలను రిచ్ చేస్తాడా? జగనన్న పథకాలు ప్రతి పేద ఇంటికీ అందాయన్నారు. పూర్ టు రిచ్ అనే అడుగులు ఇప్పటికే పడ్డాయని, జిల్లాలో తాగునీటి పథకాలు తీసుకొచ్చిన ఘనత దివంగత రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత సిఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతాయన్నారు.
110 కోట్లతో రాప్తాడు నియోజకవర్గంలోని గ్రామాలకు పిఎబిఆర్ నీరు తీసుకొచ్చే పథకానికి శ్రీకారం చుట్టామని, గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి వివిధ గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇంటింటికీ తాగునీటి కొళాయి అందించే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 1000 పింఛన్ ఇచ్చిన చంద్రబాబు 4 వేలు ఇస్తానంటే నమ్మొచ్చా అని తోపుదుర్తి నిలదీశారు.