AP Heavy Rains Alert ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరం వెంబడి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దీనికితోడుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మరో ఆవర్తనం ఉంది. ఈ క్రమంలో రానున్న మూడ్రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఈ క్రమంలో ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఇతర కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. మొత్తానికి ఏపీలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు. మత్స్యకారులు కూడా సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఏపీలోని ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నాయి. పిడుగులు పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి. పిడుగులు పడే ప్రమాదమున్నందున ఆరుబయట, చెట్లు, టవర్ల కింద ఉండవద్దని హెచ్చరిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం తెలంగాణవైపుకు వ్యాపించే అవకాశం ఉండటంతో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు మల్కాజ్‌గిరి, వికారాబాద్, జనగాం, సిద్ధిపేట, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.


