Smart Family Card in AP: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ జారీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ కార్డు తరహాలో ఉండే ఈ కొత్త ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాల వివరాలు, లబ్దిదారుల సమాచారం ఇతర వివరాలన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. ఈ కార్డుల జారీకి సంబంధించి ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించాలని.. ప్రభుత్వ పథకాల వివరాలను అందులో పొందుపర్చాలి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏయే కుటుంబాలకు ఏమేం అవసరాలున్నాయో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత వాటిని కార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. పథకాలు వేగంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నేరుగా లబ్దిదారులకు చేరేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎప్పటికప్పుడూ అప్‌డేట్: ఈ కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న పథకాల వల్ల కుటుంబాలు, వాళ్లు పొందుతున్న పథకాలకు ఎటువంటి ఇబ్బందులు రావొద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం త్వరలో పాపులేషన్ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా తీసుకురానుందని.. అందుకు తగినట్లుగానే ప్రజా సంక్షేమాన్ని మరింత విశ్లేషించి, అవసరమైతే పథకాలను రీ-డిజైన్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబాల అవసరాలను తెలుసుకుని, ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
ఉపయోగాలు: ఈ స్మార్ట్ కార్డు ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఓ హక్కుగా మారతాయి. అవసరమైన లబ్ధిదారుల వివరాలు ఒక్క కార్డులో పొందుపరచడం వల్ల సంక్షేమ కార్యక్రమాలు సులభంగా, సమర్థంగా ప్రజలకు చేరుతాయి. రాష్ట్రంలో పారదర్శకంగా, వేగంగా డిజిటల్ పాలనను కొనసాగించేందుకు ఫ్యామిలీ కార్డు కీలక పాత్ర పోషించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సంక్షేమాన్ని మరింత అందరికీ సమర్థవంతంగా, పారదర్శకంగా అందించనుంది.


