ఐఎండి సూచనల ప్రకారం బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తుపానుగా,రాత్రికి తీవ్రతుపానుగా బలపడుతుందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. తదనంతరం ఉత్తరం వైపు కదులుతూ ఆదివారం అర్ధరాత్రి సమయంలో బంగ్లాదేశ్ మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాల దగ్గరలో సాగర్ ద్వీపం మరియు ఖేపుపరా మధ్య తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఏపీపై దీని ప్రభావం లేదని స్పష్టం చేశారు.
రేపు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి శ్రీ సత్యసాయి మరియు వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లుండి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ రూరల్లో 96మిమీ, శంఖవరంలో 65.2మిమీ, పిఠాపురంలో 62.5మిమీ, పెదపూడి 59మిమీ, అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 42.7మిమీ,కాకినాడ జిల్లా సామర్లకోట 39.7మిమీ, అల్లూరి జిల్లా చింతపల్లిలో 35.5మిమీ, నర్సీపట్నం 29.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. దాదాపు 60 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షావు పడినట్లు తెలిపారు.
రేపు శ్రీకాకుళం 10, విజయనగరం 15 , పార్వతీపురంమన్యం 5, అనకాపల్లి 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో 42.9°C, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 42.2°C, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.2°C,ప్రకాశం జిల్లా పామూరులో 42°C, వైయస్ఆర్ జిల్లా జమ్ములమడుగులో 41.8°C, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 41.6°C, పల్నాడు జిల్లా నూజెండ్లలో 41.3°C, చిత్తూరు జిల్లా పాలసముద్రం, కృష్ణాజిల్లా కంకిపాడులో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.