MP Mithun Reddy Arrest: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విజయవాడ సిట్ కార్యాలయానికి నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదే విషయాన్ని సిట్ అధికారులకు మిథున్ రెడ్డి సమాచారమిచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఒకవేళ విచారణకు ఎంపీ వస్తే.. అతనికి వారెంట్ ఇచ్చిన వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే ఇదే విషయంపై ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఎంపీ ఆశ్రయించారు. ఆ పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేయడం వల్ల మిథున్ రెడ్డి విచారణకు హాజరవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏ4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు.
లిక్కర్ కేసులో 11మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు…220 మందిని విచారించిన తర్వాత, కీలక ఆధారాలు సేకరించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినా.. పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తోంది. సుమారు 3వేల 500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ చెబుతోంది. డిస్టిలరీల నుంచి లిక్కర్ ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ముడుపుల వసూళ్ల వరకు.. తెర వెనుక కథను మిథున్ రెడ్డే నడిపారని సిట్ ఇప్పటికే హైకోర్టు, ఏసీబీ కోర్టుకు నివేదించింది. ఈ కేసులో ఏ4గా మిథున్‌రెడ్డి ఉన్నారు.
ఏపీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. జులై 21వ తేదీన సిట్ కార్యాలయంలో 10 గంటలకు విచారణకు రావాలని సిట్ సూచించింది. ఈయన నారాయణ స్వామి గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రితో పాటు ఉపముఖ్యమంత్రిగానూ పనిచేశారు.


