Rs.11-Crore Cash Seized: ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ అధికారులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్‌హౌజ్ వద్ద జరిగిన సోదాలో అధికారులు బియ్యం బస్తాల మధ్య దాచిన 12 కార్టన్ బాక్సులను గుర్తించారు. ఇందులో రూ.11 కోట్ల నగదును పట్టు బడినట్లు అధికారులు చెప్పారు.
కస్టడీలో ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు, సిట్ అధికారులు ఈ దాడులు చేశారు. ఈ వాంగ్మూలం ఆధారంగా ఈ ఫార్మ్‌హౌజ్‌లో సోదాలు నిర్వహించగా భారీ నగదు పట్టుబడింది. ఈ మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు వినయ్ అనే వ్యక్తి ద్వారా నగదును భద్రపరిచినట్లు తేలింది. ఇందుకు సంబంధించి సిట్ అధికారులు చాణక్య, వినయ్ పాత్రలపై కూడా విచారణ చేస్తున్నారు. ఈ కేసులో దాదాపు రూ.3,500 కోట్ల వరకు సొమ్ము పక్కదారి మళ్లించినట్లు అంచనా వేస్తున్నారు.
అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు అధిక మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చి రూ.3,500 కోట్లకు పైగా లాభాలు పొందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్ర ఖజానాకు సైతం రూ.18,860 కోట్ల నష్టం జరిగినట్లు తేలింది. ఇప్పుడు ఈ కేసులో భారీగా నగదు పట్టుబడటంతో మరోసారి మద్యం కుంభకోణం వైరల్ అవుతోంది.
గుట్టుచప్పుడు కాకుండా: ఈ సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ విజయేందర్ రెడ్డి అనే యజమానిగా గుర్తించారు. ఆయన తల్లి సులోచన పేరుతో ఈ ఫార్మ్ హౌస్‌ని నిర్మించినట్లు తెలుస్తోంది. భారీగా నగదు పట్టుబడటంతో ఈ సంఘటనపై ఈడీ, ఐటీ సంస్థలు సైతం దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 16 డిస్టిలరీల ద్వారా రూ.1,677.68 కోట్ల ముడుపులు కూడగట్టినట్లు సిట్ గుర్తించింది. రాజ్ కెసిరెడ్డి బినామీగా ఉన్న కంపెనీ యూపీ డిస్టిలరీ కూడా ఇందులో ఉన్నట్టు తేలింది. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద కుంభకోణం: అధికార కూటమి ప్రభుత్వం ఈ స్కామ్‌ని దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తుంది. మద్య నిషేదం పేరుతో జగన్ అక్రమంగా రాష్ట్ర ఖాజానాకు గండి కొట్టి సంపాదన కూడగట్టినట్లు ఆరోపిస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుంభకోణంపై అన్ని కోణాల్లో విచారణ ఆరంభించింది. దీంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో అతి త్వరలోనే జగన్ సైతం అరెస్ట్ అవుతారని కూటమి నేతలు చెబుతున్నారు.
AP Liquor Scam: ఏపీ మద్య కుంభకోణంలో సంచలనం.. భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు!
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


