ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. తాజాగా హైదరాబాదులో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్ అందరితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వినోద్ కుమార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విషయంలో అన్ని మెడికల్ కళాశాలలు కఠినంగా ఉండాలని స్పష్టంచేశారు. మెడికోలపై ఎక్కడా, ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదని చెప్పారు.
కళాశాలల్లోని యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా పనిచేయాలని చెప్పారు. ర్యాగింగ్, ఇతర వేధింపులకు సంబంధించి ఆయా కళాశాలలపై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివర్సిటీ వీసీ పర్యవేక్షణ ఉండాలని పేర్కొన్నారు. ఆయా కళాశాలల నుంచి ఎప్పటికప్పుడు యాంటి ర్యాగింగ్ కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ ఉండాలన్నారు. విద్యార్థులతో బోధనా సిబ్బంది సహృద్భావంతో ఉండాలని చెప్పారు. కొంతమంది సీనియర్ అధ్యాపకులు వారి సొంత క్లినిక్‌ల నేపథ్యంలో పీజీ విద్యార్థులపై పనిభారం మోపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయని, ఈ పద్ధతి మారాలని తెలిపారు.
పటిష్టమైన చర్యల ద్వారానే ఫలితాలు
చదువుల్లో నాణ్యతే కాదని, భద్రత కూడా ఉండాలని మంత్రి విడదల రజిని తెలిపారు. పటిష్టమైన చర్యల ద్వారా మనం సురక్షితంగా మెడికోలను సమాజంలోకి తీసుకురాగలమని చెప్పారు. అన్ని మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఒత్తిడి నుంచి బయటపడేలా విద్యార్థులకు యోగా, ధ్యానం లాంటి అంశాలపై అవగాహన పెంచాలన్నారు. కళాశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాలన్నారు. ఏదైనా సమాచారాన్ని వెనువెంటనే చేరవేసేలా క్యాంపస్‌లో పలు చోట్ల మైక్‌లు ఏర్పాటుచేసుకోవాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీనియర్, జూనియర్ విద్యార్థులకు ప్రత్యేక వసతి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. వారి భోజన సమయాలు కూడా ఒకేలా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మన రాష్ట్రంలోని ఏ ఒక్క మెడికల్ కళాశాలలో కూడా ఎక్కడా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా నమోదు కావడానికి వీల్లేదని స్పష్టంచేశారు.