ఐఎండి సూచనల ప్రకారం తమిళనాడు మీదగా ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం ఉదయం 8:30 గంటలకు వరకు 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు 130.6 మిమీ,
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిమీ, కడియంలో 114 మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 110 మిమీ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 102మిమీ, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 98.4మిమీ, వైయస్ఆర్ జిల్లా రాజుపాలెం 95.8మిమీ అధికవర్షపాతం నమోదైందన్నారు.
రేపు శ్రీకాకుళం4, విజయనగరం 3, పార్వతీపురంమన్యం 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం కర్నూలు జిల్లా జి. సింగవరంలో 39.7°C, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 39.4°C, అల్లూరి జిల్లా కొండైగూడెం, అనంతరం కురువల్లిలో 39.3°C, అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో 39.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.