Balineni Srinivasa Reddy| వైఎస్సార్ కుటుంబం ఆస్తుల విషయంలో మాజీ సీఎం జగన్(Jagan), ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల(Sharmila) మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ.. ఆస్తుల కోసం వైఎస్సార్ కుటుంబం ఇలా రోడ్డున పడి తగాదాలు పడటం బాధాకరణమని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం విజయమ్మ(YS Vijayamma) ముందుకు రావాలని సూచించారు. ఆమె మాట ప్రకారం జగన్, షర్మిల నడుచుకోవాలని చెప్పుకొచ్చారు.
ఈ అంశంపై వైసీపీలోని చోటా, మోటా నాయకులు మాట్లాడటం తగదన్నారు. వాళ్లకు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. విజయమ్మ దయ వల్లే వైవీ సుబ్బారెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనాలు పొందారని తెలిపారు. అలాగే తాను కూడా ఆమె వల్లే రాజకీయంగా ఎదిగానని గుర్తుచేసుకున్నారు. ఆస్తుల వివాదంలో షర్మిల కన్నీళ్లు పెట్టుకున్నారని.. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని వ్యాఖ్యానించారు. జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంలో సీఎం చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. జనసేనలో ఉన్నా కానీ వైఎస్సార్ మీద కృతజ్ఞతతో మాట్లాడుతున్నానని వివరించారు. వైఎస్ మరణంపై బురద జల్లడం మంచిది కాదని కోరారు. తాను ఏ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఆస్తులు సంపాదించుకుని పార్టీ మారినట్లు కొంతమంది వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి సాక్షిగా చెబుతున్నానని.. వైసీపీలో ఉన్నప్పుడు ఆస్తులు పోగొట్టుకున్నా తప్ప సంపాదించుకోలేదన్నారు. ఆ విషయం జగన్‌కూ తెలుసున్నారు. ఎలా అన్నది మనసులో పెట్టుకున్నానని.. సంస్కారం ఉంది కాబట్టే దాని గురించి మాట్లాడలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(PawanKalyan)ను కలిసినప్పుడు ఎన్నికలకు ముందే పార్టీలోకి తీసుకుందామనుకున్నట్లు చెప్పారని తెలిపారు. కానీ జగన్‌కు బంధువులు కదా.. మిమ్మల్ని పార్టీలోకి తీసుకుని కుటుంబాన్ని చీల్చడం ఇష్టంలేక అడగలేకపోయాను అని పవన్ హుందాగా మాట్లాడారన్నారు. ఆ పార్టీలో తనకు ఏం జరిగిందో.. ఎలాంటి అవమానం జరిగిందో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని బాలినేని వెల్లడించారు.