ప్రతి మగవారి విజయం వెనుక ఆడవారి కష్టం దాగి ఉంటుందన్న సామెత బనగానపల్లె నియోజకవర్గంలో అక్షర సత్యమైంది. బనగానపల్లె ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో బీసీ జనార్దన్ రెడ్డి గెలుపొందడం వెనక ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి పాత్ర ఎంతగానో ఉంది.
2019 ఎన్నికల తర్వాత ఓటమితో కుంగిపోకుండా బీసీ ఇందిరారెడ్డి ధైర్యంగా ముందడుగు వేశారు. వాస్తవానికి చెప్పాలంటే బిసి జనార్దన్ రెడ్డి కంటే కూడా బీసీ ఇందిరా రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కలియ తిరిగారు. ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. శుభకార్యమైనా, అశుభకార్యమైనా, పరామర్శలకైనా, పండుగలకైనా సందర్భంగా ఏదైనా బీసీ ఇందిరారెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు. ఒకవైపు బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర నాయకునిగా ఇతర జిల్లాలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తమ పట్టుసడలకుండా బీసీ ఇందిరా రెడ్డి కాపాడుకుంటూ వచ్చారు. ఒకానొక దశలో బీసీ ఇందిరా రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతారా అన్న స్థాయిలో ఆమె నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ప్రచార కార్యక్రమాలను తన భుజస్కందాలపై వేసుకొని విజయవంతంగా నిర్వహించారు. నియోజకవర్గంలో మహిళలతో, యువతతో సమావేశాలు ఏర్పాటు చేయడం, పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను, టిడిపి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో సుమారు 52 రోజుల పాటు నిరాహార దీక్ష శిబిరం చేపట్టడం, యువగళం కార్యక్రమాలను అన్ని తానై నడిపించారు. ఆమె కష్టపడే గుణాన్ని చూసి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పలుసార్లు ప్రశంసించారు.
బనగానపల్లె పట్టణంలో ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఇచ్చి తీరాల్సిందేనంటూ భర్త బీసీ జనార్దన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రధాన అస్త్రంగా ఎన్నికల్లో మలచిన ఘనత ఆమెకే దక్కుతుంది. బిసి జనార్దన్ రెడ్డి సైతం పలు సందర్భాలలో తన భార్య సహకారంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, రాజకీయాలలో ఆమె అందించిన ప్రోత్సాహం తనను ఉత్సాహంగా రాజకీయాల్లో ఉండేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా బీసీ జనార్దన్ రెడ్డి గెలుపులో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఎంతో ఉంది. సోదరులు బీసీ రాజారెడ్డి, బీసీ రామనాధరెడ్డి అన్న గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. అలాగే కుమార్తె, కోడలు కూడా ప్రచార పర్వంలో తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు లేకున్నా కార్యకర్తలే తమ బలంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఏది ఏమైనా బీసీ కుటుంబ సభ్యులు కార్యకర్తలనే తమ కుటుంబ సభ్యులుగా భావించి సమిష్టిగా గెలుపు సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు.