మండలంలోని అటవీప్రాంతం సమీపంలో వెలసిన శ్రీ ఉమాసమేత ఓంకారసిద్ధేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా ఉదయం 6 గం. నుండి చుట్టప్రక్క గ్రామాల నుండి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి అక్కడవున్న పంచబుగ్గల పుష్కరిణి (కోనేరు)లో స్నానమాచరించి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శిస్తే భూత, ప్రేత పిశాచాలు, గ్రహాలూ తొలగిపోతాయని క్షేత్రపాలకునికి కాయకర్పూరాలు అర్పించి మ్రొక్కు తీర్చుకొని అనంతరం ఓంకార సిద్ధేశ్వర స్వామిని, అమ్మవారైన ఉమాదేవిని దర్శించి ఓం అనే (ప్రణవ నాదం) ఓంకార నాదం ఉచ్ఛరిస్తూ మ్రొక్కు తీర్చుకొని కాశీనాయన ఆశ్రమంలో భోజనాలు చేసి రాత్రి జాగారం కొరకు అక్కడ విడిదిచేయటానికి నెలవులు ఏర్పాటుచేసుకున్నారు.
భక్తుల కాలక్షేపం కొరకు చెక్క భజన, కూచిపూడి నాట్యం, పంచమాంకాలు పద్యనాటకంలు ఏర్పాటు చేశామని ఆలయ కార్యనిర్వాహణ అధికారి నాగప్రసాద్ తెలియజేశారు. పర్వదినం సందర్బంగా ఆలయ చైర్మన్ అన్నెం విశ్వనాథరెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన వృషభరాజముల బలప్రదర్శన పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొని ప్రారంభించారు.
ఈ బలప్రదర్శన పొటీలలో మండల పరిషత్ అధ్యక్షులు దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి,మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాసరెడ్డి,కాశీనాయన అన్నసత్రం కార్యనిర్వాహకులు నాగేశ్వరరెడ్డి,పెద్ద రామసుబ్బారెడ్డి, విక్రమ సింహానాయక్ పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల సబ్ ఇనస్పెక్టర్ మల్లిఖార్జున అధ్వర్యంలో పోలీస్ శాఖ వారు పర్యవేక్షిస్తున్నారు. నారాయణాపురం పి.హెచ్.సి బృందం, రెడ్ క్రాస్ సొసైటీ వారు వివిధ గ్రామాల నాయకులు, ధర్మకర్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.