ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్ల నాగ శ్రీనివాసులును అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు ఓటర్లను కోరారు. పెద్ద కందుకూరులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావుతో కలిసి విస్తృతంగా ప్రచారంతో ఇంటింటికి వెళ్లి టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్ల నాగ శ్రీనివాసులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈనెల 19న పోలింగ్ జరుగుతుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా టిడిపి బలపరిచిన అభ్యర్థి కి ఓట్లు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైకాపా నాయకులకు పెద్దకందుకూరు గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలో మాత్రమే ఈ గ్రామం గుర్తుకొచ్చిందన్నారు. పెద్ద కందుకూరు గ్రామం ఎక్కడ అభివృద్ధి చెందలేదని తాను మంత్రిగా ఉన్న సమయంలో గ్రామాభివృద్ధి చేశామన్నారు.
శాసనసభ ఎన్నికలు కేవలం ఏడు నెలలు మాత్రమే రానున్నాయని నాలుగు సంవత్సరాలో చేయని అభివృద్ధి ఈ నాలుగు నెలల్లో ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీలో ఇమడలేక టిడిపిలో చేరిన మన పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగ శ్రీనివాసులకు ఓటర్లు ఓటు వేసి ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సీపీకి పెద్ద కందుకూరు నుండి పతనానికి నాంది పలకాలని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. గ్రామ ఓటర్లు అందరూ ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రలోభాలకు లొంగొద్దని రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని, ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సూద్దపల్లె చంద్ బాషా, నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పాపిరెడ్డి, గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.