బేతంచెర్లలోని ఇంటింటికి కృష్ణా జలాలు అతి త్వరలో రాబోతున్నాయని బేతంచెర్ల పట్టణం నుండి కొలుములపల్లె రోడ్ (చౌడమ్మ గుడి దగ్గర) లో నూతనంగా రూ.60 లక్షలతో నిర్మించిన శేషారెడ్డి మార్కెట్ యార్డు ప్రాంభోత్సవ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. మన ప్రభుత్వంలో బేతంచెర్లలో 3వేల కుటుంబాలకు రూ.470 కోట్ల లబ్ధి చేకూర్చాం అని అన్నారు. కుల మతాలు చూడకుండా పారదర్శకంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓసీల వర్గాలన్నింటికీ మేలు చేశాం అని అన్నారు. బేతంచెర్లలో ఐదేళ్ల కాలంలో 1550 మందికి 2300 ఎకరాల సంపూర్ణ భూహక్కు పత్రాలు అందజేశారు. డీ పట్టా భూమి ఎకరాకు రూ.10 లక్షల చొప్పున వేసుకున్నా 1550 కుటుంబాలకు రూ.230 కోట్లవిలువైన భూమి పంచిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వంలో సూర్యాస్తమయం తర్వాత కార్యాలయాల తలుపులు తెరచేవారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే, పేదల జీవితాల్లో సూర్యోదయం మొదలైందన్నారు.
బేతంచెర్లలో రూ.60 లక్షలతో నిర్మించిన వెజిటెబుల్ మార్కెట్ యార్డును ప్రారంభించారు. సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా బేతంచెర్ల మండలంలోని 9 గ్రామాల ప్రజలకు సంపూర్ణ భూ హక్కు పత్రాల పంపిణీ చేశారు. ముద్దవరం, ఎం.పెండెకల్, ఆర్.ఎస్ రంగాపురం, కొలుములపల్లె గూటుపల్లె, ఎంబాయి, కొత్తపల్లె, గోర్లగుట్ట, బేతంచెర్ల, బుగ్గానిపల్లె గ్రామాల రైతులకు సంపూర్ణ భూ హక్కు పత్రాల పంపిణీ చేశారు. 20 ఏళ్లకు పైగా అనుభవంలో ఉన్న డీ పట్టా ప్రభుత్వ భూములకు సంపూర్ణ హక్కు పట్టాలు అందజేశారు. 1523 మంది లబ్ధిదారులకు 2378.29 ఎకరాలకు సంబంధించిన హక్కు పత్రాలను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అసైన్ మెంట్ వ్యవసాయ భూములకు సైతం మూడు విడతలుగా సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ చేశారు. 11 గ్రామాలకు చెందిన 1558 మంది లబ్ధిదారులకి 2292.84 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ హక్కు పత్రాలు అందించారు.ఆర్ఎస్ రంగాపురం, అంబాపురం, ఆర్ కొత్తపల్లె, గూటుపల్లె, కొలుములపల్లె, ఎంబాయి, బుగ్గానిపల్లె, గోర్లగుట్ట, బేతంచెర్ల, ముద్దవరం, పెండేకల్లు గ్రామాలలో భూ హక్కు పత్రాల లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మంత్రి బుగ్గన మాట్లాడుతూ బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కేవలం ఓ బూటకం అనిఅన్నారు.మహాలక్ష్మి పథకం పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ.25వేలు అని మోస మాటలు టీడీపీ చెప్తుందన్నారు. ప్రతి పేదవానికి 3 సెంట్ల స్థలంలో ఇళ్ల పట్టాలిస్తామని వంచన మాటలు టీడీపీమాట్లాడుతుందన్నారు.ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ కూడా ఉత్తి గ్యాస్ మాటలే అని అన్నారు.
డ్వాక్రా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని ఇచ్చిన మాట మాత్రమే మాఫీ చేశారన్నారు.మనసులో మాట పుస్తకంలో చదువుకునే విద్యార్థులు, ప్రభుత్వఉద్యోగులు,స్వాతంత్ర సమరయోధులు, విలేకర్లకు రాయితీలు ఇవ్వకూడదని బాబు తన మనసులోని మాట చెప్పారన్నారు. డోన్ నియోజక వర్గ టీడీపీ ఇంఛార్జ్ హోదాలో ధర్మవరం సుబ్బారెడ్డి పేద ప్రజలకు సొంతంగా ఇచ్చే హామీలు ఏవంటే, బేతంచెర్లలో 12వేల మందికి సెంటున్నర ప్లాట్లు ఇస్తాడంట. ఇవ్వాలంటే, 300 ఎకరాలు ఎక్కడ, ఎలా ఇస్తారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎకరాకు కనీసం రూ.కోటి చొప్పున, ఒక్క బేతంచెర్ల పట్టణానికికే రూ.300 కోట్లు ఖర్చు పెడతారా టీడీపీ ఇంఛార్జ్? అని ప్రశ్నించారు. నిత్యం విమర్శించే టీడీపీ ఇంచార్జ్, పోటీ చేయడానికి ముందు టికెట్ తెచ్చుకోండి అని అన్నారు. సీటు జారుతోంది, మీ సీటు కాపాడుకో..! నా గెలుపోటములు ప్రజా, దైవానుగ్రహం అన్నారు. తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్యాలయాలు, ఉపాధి శిక్షణ కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, అతిథి గృహాలు, పర్యాటక ప్రాంతాలు ఇవన్నీ అభివృద్ధి కాదా ? అని అన్నారు. ఈ ప్రాంతాలలో కొత్తగా పెళ్లయిన దంపతులు పార్కులకు బదులు, గొరుమాను కొండలో కట్టిన భవనాల దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు. వాల్మీకి గుహలకు అనంతపురం నుంచి పర్యాటకులు వచ్చి చూస్తూన్నారు. రూ.50 కోట్లతో మద్దలేటి స్వామి ఆలయ అభివృద్ధి జరిగింది. గత ప్రభుత్వంలో ఖనిజాలు, సహజ వనరులన్నీ కొల్లగొట్టారని అన్నారు. ప్రజల నమ్మకం వల్లే డోన్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలకు మంచి జరిగుంటేనే మాకు ఓటేయండి అని అడిగిన ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశామా? అని అన్నారు. ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయటఉండాలి , టీ గ్లాస్ సింక్ లో ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గజమాలతో ఘన సత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో బేతంచెర్ల ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, శ్రీ మద్దిలేటి స్వామి ఆలయ పాలక మండలి కమిటి ఛైర్మన్ బి. సీతా రామచంద్రుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ బాబు రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ, మైనార్టీ కార్పొరేషన్ ముర్తుజావలి, ఉర్దూ అకాడమీ సభ్యులు ఖాజా, యామసాని జగన్మోహన్ రెడ్డి, బీరవోలు నాగేశ్వర రెడ్డి, గూని నాగరాజు, రెవెన్యూ, నగర పంచాయితీ అధికారులు అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు.