Monday, November 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Chaganti met CM CBN: విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంపొందించాలి

Chaganti met CM CBN: విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంపొందించాలి

ప్రభుత్వ సలహాదారు చాగంటి

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్ తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని… ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

- Advertisement -

నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయ‌వ‌చ్చు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం. వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలి. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలి. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయి. నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.

సుమతీ-వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్ధులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్‌తో చర్చించానని చాగంటి కోటేశ్వరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వర‌రావును సీఎం శాలువాతో సత్కరించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News