ఐదు కోట్ల మంది ఆంధ్రుల కల అయిన రాజధాని అమరావతి(Amaravati) పున:ర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు అంతా సిద్ధమైంది. కాసేపట్లో ప్రధాని మోదీ(PM Modi) చేతుల మీదుగా అమరావతి పున:నిర్మాణ పనులు లాంఛనంగా మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతూ ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నాను.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు ఈరోజు రాష్ట్రానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం… సుస్వాగతం. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని మీ అమృత హస్తాలతో ప్రారంభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పవన్ ట్వీట్ చేశారు.