ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనూహ్యంగా హస్తనకు వెళ్లనున్నారు. వాస్తవానికి మే 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న చంద్రబాబు, షెడ్యూల్ కంటే ముందుగానే మే 22న ఢిల్లీకి చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు హస్తినాలో ఉండనున్నారు.
ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్ సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీకి రావాల్సిన నిధులు, పథకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న లిక్కర్ స్కాం కేసుపై కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సిట్, ఈడీ విచారణలు వేగంగా సాగుతుండగా… జగన్ పాత్రపై ఉన్న ఆధారాలపై కేంద్రానికి వివరాలు ఇవ్వవచ్చని ప్రచారం.
ఇటీవల లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలవగా, వెంటనే చంద్రబాబు పర్యటన ఉండడం పలు రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. కడపలో మహానాడు ఏర్పాట్లు జోరుగా సాగుతున్న క్రమంలోనే బాబు ఢిల్లీకి వెళ్లడంపై వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. మొత్తానికి బాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.