నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna)కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య చెల్లి, సీఎం చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి.. కుటుంబసభ్యులకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నారా, నందమూరి కుటుంబాలతో పాటు పలువురు ముఖ్యలు హాజరయ్యారు. ఇక ఈ కుటుంబ వేడుకకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు అందరి చేత నవ్వులు పూయించడం విశేషం.
“ఓవైపు బాలయ్య… మరోవైపు భువనేశ్వరి . ఇద్దరి మధ్యన నేను నలిగిపోతున్నా. వీళ్లిద్దరి మధ్యన ఉంటే చాలా ప్రమాదం. ఈ ఫ్యామిలీ పార్టీ గురించి కూడా నాకేమీ తెలియదు. తన అన్నయ్య కోసం భువ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నిన్నటిదాకా మా అల్లరి బాలయ్య.. ఇప్పుడు పద్మభూషణుడు..ఎన్టీఆర్‌ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారు. అందుకు నేను గర్విస్తున్నాను. బాలయ్యకు పద్మభూషణ్ రావడం మా కుటుంబానికి గర్వకారణం. మా కుటుంబంలో ఇంతపెద్ద అవార్డు రావడం ఇదే ప్రథమం.
ముచ్చటగా మూడు సార్లు హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య. అప్పుడప్పుడు వసుంధరకు టికెట్ ఇవ్వమని అడుగుతుంటాడు. మరి కావాలనే ఆ విధంగా అడుగుతాడో, లేక ఆమెను మెప్పించడానికి అడుగుతాడో అర్థం కాదు. బాలకృష్ణ పైకి అల్లరిగా కనిపించినా, లోపల డెప్త్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. గొప్ప మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి. క్యాన్సర్ ఆసుపత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారు. బాలయ్య టేకోవర్ చేసిన తర్వాత క్యాన్సర్ ఆసుపత్రి దేశంలోనే అగ్రగామి ఆసుపత్రుల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. అందుకు నేనెంతో గర్విస్తున్నాను” అంటూ చంద్రబాబు సరదాగా మాట్లాడారు.