ఆంధ్రప్రదేశ్‌లో పేదరికాన్ని నిర్మూలించి, అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ‘పీ-4’ (P4) కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్ (Public-Private-People Partnership) పద్ధతిలో అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలి దశలోనే దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులకు సహాయం అందించనున్నారు.
వెలగపూడిలో ఘనంగా ప్రారంభోత్సవం : వెలగపూడిలోని సచివాలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు భారీ స్థాయిలో హాజరయ్యారు. “మార్గదర్శి – బంగారు కుటుంబం” అనే నినాదంతో ఈ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు.
ప్రభుత్వం అండగా బంగారు భవిష్యత్ : ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, డీబీవీ స్వామి సహా కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనలో పీ-4 కీలక భూమిక పోషిస్తుందని, ప్రభుత్వ ప్రణాళికలు అమలు కావడంతో లక్షలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని నేతలు వ్యాఖ్యానించారు. ‘పీ-4’ ద్వారా ఏపీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం రాయనుందా.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాబోతుందా.. అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.