CM Chandrababu ON PV: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి అనేక రంగాల్లో అమూల్య సేవలు అందించిన నాయకుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో నిర్వహించిన “ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు” సిరీస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పీవీ వ్యక్తిత్వం, విధానాలు దేశ చరిత్రలో ఓ మలుపు తీసుకువచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు అభిప్రాయపడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పీవీ నరసింహారావు అందించిన సేవలు మరచిపోలేనివని చెప్పారు. రాష్ట్రానికి చెందిన నేతగా మాత్రమే కాకుండా, దేశ రాజకీయాల్లో ఎంతో విలక్షణమైన స్థానాన్ని ఆయన ఏర్పరచుకున్నారని కొనియాడారు.
ఆర్థిక సంస్కరణల శిల్పి
1991 నాటికి భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయనే ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేసిన నాయకుడని ప్రశంసించారు. దేశంలో ఐటీ విప్లవానికి పునాదులు వేసింది పీవీ తీసుకున్న నిర్ణయాల వల్లే సాధ్యమైందన్నారు. “ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలే మనం నేడు అనుభవిస్తున్నాం,” అని పేర్కొన్నారు.
బహుభాషా నైపుణ్యంపై వ్యాఖ్యలు
పీవీ నరసింహారావు భాషల్లో ఎంతో దిట్ట అని, మొత్తం 17 భాషలను అనర్గలంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఆయనకు ఉందని తెలిపారు. ఈ సందర్భంలో “అంతటి భాషాజ్ఞుడైన నాయకుడు మన దేశాన్ని నడిపించాడంటే గర్వించాల్సిందే. కానీ నేడు కొందరు హిందీ ఎందుకు నేర్చుకోవాలి అంటున్నారు, ఇది దురదృష్టకరం,” అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పీవీ నరసింహారావు జీవిత చరిత్ర, తత్త్వచింతన, రాజనీతిక దృష్టికోణం ఈ తరం నేతలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. దేశానికి చేసిన సేవలతో ఆయన జాతీయ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.


