సీఎం చంద్రబాబు (Chandrababu) పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) సందర్శించారు. తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారధి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామన్నారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ ప్రాజెక్టు కోసం రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారన్నారు. ఇప్పటివరకూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని తెలిపారు. వీలైనంత త్వరగా పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారని.. పోలవరం సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు.
