ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) కారణంగా తెలంగాణ మీద పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో దీనికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ఆలయానికి ముప్పు ఏర్పడే అవకాశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.
ఇదిలా ఉంటే ఏపీలో బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేసిన ప్రకటన తెలంగాణతో వివాదానికి కారణమవుతోంది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరద జలాల ఆధారంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పాలని సీఎం సూచించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని తెలిపారు.