వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్(Zakia Khanam) పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ మోషేన్ రాజుకు లేఖ రాశారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జాకియా ఖానమ్‌ను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉంటున్న ఆమె రాజీనామా చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు.
కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల్లో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకట రమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ ఉన్నారు. తాజాగా జకియా ఖానమ్ రాజీనామాతో మండలిలో వైసీపీ బలం రోజురోజుకు తగ్గిపోతుంది.
