Crime News: చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన నాగమణికి 1992లో ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ఓ మగ పిల్లాడు పుట్టాడు. రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల క్రితం కొడుకు మరణించగా.. అదే దిగులుతో భర్త కూడా మరణించాడు. కొడుకు ఇన్సూరెన్స్, భర్త ఆస్తులన్నీ నాగమణికి వారసత్వంగా వచ్చాయి. ఒంటరిగా ఉన్న ఆమెకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఇదే విషయమై చిత్తూరులోని ఓ పెళ్లిళ్ల మధ్యవర్తిని సంప్రదించింది. ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శివప్రసాద్ నాయుడు అనే వ్యక్తితో నాగమణిని కలిసి తన భార్య చనిపోయిందని చెప్పాడు. పిల్లలు కూడా లేరని నమ్మించాడు.
అయితే అతనికి అప్పటికే భార్య బతికే ఉన్నదని.. చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ చూపించాడు. దీంతో నాగమణి అతడితో పెళ్లికి అంగీకరించింది. శివప్రసాద్ తో కుటుంబ సభ్యుల సమక్షంలో 2022 అక్టోబర్‌లో కర్ణాటకలోని బంగారు తిరుపతి ఆలయంలో వివాహం జరిగింది. అక్కడే నివాసం ఉంటున్న వీరిద్దరూ.. కొన్నాళ్ల తర్వాత ఆర్‌బీఐ నుంచి రూ. 1,700 కోట్ల లాటరీ తగిలిందని తన భార్యకు ఓ పత్రాన్ని చూపించాడు. ఇంత డబ్బు రావాలంటే ముందుగా రూ. 15 కోట్లు చెల్లించాలని భార్య నాగమణిని నమ్మించాడు. దీంతో ఆమె ఖాతాలో ఉన్న రూ.3 కోట్ల నగదును శివప్రసాద్‌తో పాటు అతని అన్న, వదినల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము బదిలీ చేసింది. అంతే కాకుండా రూ.15 కోట్లు విలువైన భూములు, రూ.10 కోట్ల విలవైన భవనాన్ని అమ్మేసి మొత్తంగా రూ.28 కోట్లు శివప్రసాద్ కు అప్పగించింది.
రోజులు గడుస్తున్నా లాటరీ డబ్బు రూ.1,700 కోట్లు ఇంకా రాలేదని నాగమణి ప్రశ్నిస్తే ఆయన మాయమాటలు చెప్పి తప్పించుకునేవాడట. ఒకరోజు గట్టిగా నిలదీయడంతో చంపేస్తానని నాగమణిని భర్త బెదిరించడం గమనార్హం. ఇదే క్రమంలో గతేడాది డిసెంబరులో అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడ్ని వెతుక్కుంటూ వెళ్లిన నాగమణికి ఊహించని షాక్ తగిలింది. శివప్రసాద్ నాయుడికి భార్యతోపాటు ఎనిమిదేళ్ల కూతురు ఉందని తెలిసి నాగమణి బిత్తరపోయింది. ఇదే విషయమై అడిగితే ఆమెపై అందరూ కలిసి దాడి చేసినట్లు తెలిసింది. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణకు ఎస్పీ నుంచి ఆదేశాలు వచ్చాయి.


