వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ అయి జైలులో గడుపుతున్నారు. ఈ అరెస్టుల నుంచి కోలుకోకముందే మరో షాక్ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) మాజీ పీఏ, వైద్యాశాఖ ఉద్యోగి మురళి (Murali)ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా మురళి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆస్తులు గుర్తించారు.
20 ఎకరాలకు పైగా భూమి, విశాఖపట్టణం, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఫ్లాట్లకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాతగే కిలో బంగారం, 11.36 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వస్తువులను గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.50కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఆస్తులకు సంబంధించిన సరైన వివరాలు పొందుపర్చకపోవడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.