ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేసి చూపిస్తానని ధర్మవరం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ముదిగుబ్బ మండలంలోని తిమ్మనాయునిపాలెంలోని వెంగముని స్వామి దర్శనంతో మొదలై ప్రతి గుండెను తడుతూ, ప్రతి సమస్యను వింటూ బసిరెడ్డిపల్లె, ఇరికిరెడ్డిపల్లి, ఆకుతోటపల్లి, గుట్టకిందపల్లి, మల్లేపల్లి, యంగన్న గారి పల్లి, పాయగట్టుపల్లి, దిగువపల్లి, రామిరెడ్డిపల్లి, తప్పెటవారిపల్లి, శిరగారిపల్లి, పైపేడు, పెద్దన్నవారిపల్లి, మద్దన్నగారిపల్లి, చెంచువారిపల్లి, కొండగట్టుపల్లి, దేవరగుడిపల్లి, ఒడ్డుకింద తాండ, కోటిరెడ్డిపల్లి, పి.కొట్టాల, సానెవారిపల్లి సత్య కుమార్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ మండలం మరియు మండలంలోని పల్లెల్లో కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఏర్పడిన నీటి సమస్యలను, రహదారులను అలాగే మొబైల్ సిగ్నల్స్ సమస్యలను కూడా పట్టించుకోకుండా పోవడం చాలా బాధాకరమన్నారు. గుక్కెడు నీటి కోసం పల్లె వాసులు ఎంత అవస్థలు పడుతున్నారో వారితో మాట్లాడుతోంటే తెలుస్తోందని చెప్పారు.
ప్రజలకు కనీసం తాగునీరు మౌలిక వసతులను కూడా ఇవ్వలేని ఒక అసమర్థ వ్యక్తి కేతిరెడ్డి లాంటి వారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజలు ఐదేళ్లపాటు నరకం అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల రూపంలో పల్లె ప్రజలకు ఇప్పుడు ఒక సువర్ణవకాశం వచ్చిందని, ఈవీఎంలో కమలం గుర్తుకు ఓటు వేసి కేతిరెడ్డికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపి సహకారంతో పల్లెల్లో అన్ని సమస్యలను తీరుస్తూ అభివృద్ధికి చిరునామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాను మాటల వ్యక్తిని కాదని చేతల వ్యక్తిని మాత్రమేనని ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందరికీ అర్థమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండల కన్వీనర్ ప్రభాకర్ చౌదరి టౌన్ ఇంచార్ మనోహర్ నాయుడు, రమేష్ బాబు ఎంపీపీ ఆదినారాయణ గడ్డం రాజగోపాల్ బిజెపి ప్రకాష్ తదితర బిజెపి, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.