జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో మరోమారు ఉత్తుత్తి హామీలతో జనాలకు టోకరా వేయడానికి సిద్ధం అయ్యాడని ధర్మవరం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలోని సంగాల, వరదాపురం, కొత్త కట్ట (విశ్వనాథ్ పురం), చిన్నే కుంటపల్లి, ఓబులాపురం, రామాపురం, కొడేకండ్ల, తంబాపురం, జ్వాలాపురము, గుమ్మలగుంట, చెన్నారాయపట్నం, అప్రా చెరువు, పోట్లమర్రి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లకు మోసం చేయడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోకే అబద్ధాలు రంగరించి ఇప్పుడు విడుదల చేశారని చెప్పారు.
అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో మేనిఫెస్టోలో ఉన్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల నెత్తిన టోపీ పెట్టిన జగన్ సర్కారు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓటర్ల ముందుకు వస్తోందని ఆయన ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి జగన్ బ్రాండ్ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారన్నారు. రాష్ట్రం కోసం కేంద్రం కోట్లాది రూపాయలు నిధుల్ని ఇస్తున్నప్పటికీ వాటికి జగన్ పేరు పెట్టి తమ సొంత నిధులు ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. రైతులకు పీఎం కిసాన్ యోజన, రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యము, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పేదల ఇళ్ళు తోపాటు మరెన్నో పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొట్టడంతో పాటు విలువైన సహజ వనరులను దోచుకున్నారని చెప్పారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్ లతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా అక్రమార్జనకే ప్రాధాన్యం ఇచ్చిన జగన్ ను ప్రజలు నమ్మబోరని, ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్రంలో బిజెపి, టిడిపి , జనసేనల ట్రిపుల్ ఇంజన్ సర్కారును తేవడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు.