గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్‌లో అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. ఉద్యోగులంతా విధుల్లో ఉండగానే భవనం రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సెంట్రల్ ఏసీలో షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. మంటలు ధాటికి కంప్యూటర్లు, కొన్ని దస్త్రాలు కాలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం మంటల్లో కాలిపోయి ఉండవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.