జగన్ తొలి కేబినెట్ లో కీలకమైన హోంమంత్రి పదవిని దక్కించుకున్న మేకతొటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తరువాత పార్టీలో కనీస గుర్తింపు లేకపోవడమే కాకుండా అడుగడుగునా అవమానాలు ఎదురౌతున్నాయన్న భావనలో సుచరిత ఉన్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలకు కూడా రాం.. రాం.. చెప్పేయడమే కాకుండా తాజాగా పలువురు పార్టీ జిల్లాల అధ్యక్షులు, సమన్వయ కర్తలను మార్చిన అధినేత ఆ జిల్లా బాధ్యతలను డొక్కా మాణిక్య వరప్రసాద్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మేకతోటి సుచరిత చాన్నాళ్లుగా వైసీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
హోం మంత్రిగా వైసీపీలో ఒక వెలుగు వెలిగిన తనకు పార్టీలో రోజు రోజుకూ ప్రాధాన్యం తగ్గిపోతున్న తీరుతో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. ఆ దిశగా సుచరిత ఇప్పటికే కసరత్తు ఆరంభించేశారని చెబుతున్నారు. రాజకీయంగా తన ఉనికిని కాపాడుకుని, మళ్లీ యాక్టివ్ కావడంపై ఆమె దృష్టిసారిస్తున్నారని ఆమె వర్గీయులు అంటున్నారు. ఈ క్రమంలోనే మేకతోటి సుచరిత వైసీపీని వీడితే ఆమెకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటనే దానిపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సుచరితకు ఉన్న ఆప్షన్లలో ఒకటి తెలుగుదేశం పార్టీ.. అయితే మంత్రిగా, వైసీపీ నేతగా పలు వేదికలపై సుచరిత టీడీపీపై విమర్శలు చేశారు. అందుకే ఆమె తెలుగుదేశం వైపు కాకుండా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే.. ఆ పార్టీ తరఫున ఈసారి ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బరిలో దిగాలనే ఆకాంక్షను సుచరిత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఓకే అంటే.. జనసేన పార్టీ కండువా కప్పుకునేందుకు సుచరిత సిద్ధంగా ఉన్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.