గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి(Kasu Mahesh Reddy)కి ప్రమాదం జరిగింది. తన ఇంట్లోని బాత్రూమ్‌లో కాలు జారిపడడంతో ఆయన తలకు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఆయనను హుటాహుటిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం స్థానిక మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తలపై తగిలిన గాయానికి ఎనిమిది కుట్లు వేసినట్లు సమాచారం. వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా 2024 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాసు మహేశ్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోయి ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు.