ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని మహిళలు ఈ పథకం అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఉచిత బస్సు పథకం ఎప్పడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఉగాది పండుగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేశారు.
కాగా ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఇప్పటికే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంపై అధ్యయనం చేసి సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది. రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కన్వీనర్‌గా రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణికి చోటు కల్పించింది.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం కర్ణాటకలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, అధికారులను కలిశారు. వారితో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు. ఈ పర్యటన సందర్భంగా మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నారు.