Free gas cylinder| ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపావళి పండుగ కానుకగా ప్రారంభించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు తొలి బుక్సింగ్ ప్రారంభమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. బుక్ చేసుకున్న వినియోగదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ నెల 31 నుంచి అందించనున్నారు.
కాగా లబ్ధిదారులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. ఇవి ఉన్న ప్రతి గ్యాస్ వియోగదారులకు రూ.851 ప్రభుత్వం నుంచి రాయితీ రానుంది. నాలుగు నెలలకు ఓసారి సిలిండర్ చొప్పున ఏటా 3 ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ముందుగా గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ తీసుకోవడానికి వినియోగదారులు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం చెల్లించిన నగదు 48 గంటల్లో వినియోగదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతుంది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..?
పాత విధానంలోనే మీ గ్యాస్ ఏజెన్సీ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే గ్యాస్ కంపెనీల యాప్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం ఉంది. మీరు సిలిండర్ బుక్ చేయగానే మీ రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా లింక్ అయిన నంబర్‌కు మెసేజ్ వస్తుంది. అనంతరం రెండు రోజుల్లో మీ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ అయినట్లు కూడా మెసేజ్ వస్తుంది. నగదు రాని పక్షంలో దగ్గరల్లోని సచివాలయం సిబ్బందిని విచారించాలి.