‘జల శ్రీ’ పథకం ద్వారా వ్యవసాయ పొలంలో బోరు బావులు వేయించుకున్న రైతులకు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వ్యవసాయ మోటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశలవారీగా జల శ్రీ పథకం ద్వారా ప్రతి సన్న కారు చిన్న కారు రైతులకు బోర్ వేసి విద్యుత్ మోటార్ కూడా ప్రభుత్వం ద్వారా అందజేస్తామన్నారు.
ప్రతి రైతు తమకున్న కొద్దిపాటి పొలంలోనే అత్యధిక దిగుబడి సాధించి అప్పుల ఊబిలో కూరుకుపోకుండా రైతుకు అండగా వైయస్సార్ ప్రభుత్వం ఉందన్నారు. ఆర్ బి కే ల ద్వారా రైతులు పంట సాగు వివరాలు, ఎరువులు క్రిమిసంహారక మందులు, పంట దిగుబడి సాధించేందుకు మెలుకువలు వ్యవసాయ అధికారులు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఇచ్చే సలహాలను పొందాలన్నారు.
పంట మార్పిడిల ద్వారా భూమికి తెగులు రాకుండా భూమి నాణ్యత తగ్గకుండా రైతు అధిక దిగుబడి సాధించవచ్చు అన్నారు. నియోజకవర్గంలో రైతులకు రైతు భరోసా, పంట బీమా,ఇన్పుట్ సబ్సిడీ,తదితర సంక్షేమ పథకాలను అందిస్తూ ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వైయస్సార్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి సహాయం చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎంతో ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టి అత్యధిక మెజారిటీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు వీరభద్రుడు, మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, సర్పంచి తులసమ్మ, ఎంపీడీవో దౌలా, తాసిల్దార్ సుభద్రమ్మ, వివిధ శాఖ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు పాల్గొన్నారు.