గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద రేపు కూడా పెరిగి ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.
శుక్రవారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారని నీటిమట్టం 53 అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యల్లో 4NDRF, 4SDRF బృందాలు ఉన్నాయన్నారు.
కృష్ణా వరద ప్రవాహం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 2.58, ఔట్ ఫ్లో 2.68 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు.
కృష్ణా, గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీచేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.
పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల పట్ల అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.