Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: గ్రామాల్లో పనుల్లేక వలస వెళుతున్న కూలీలు

Gonegandla: గ్రామాల్లో పనుల్లేక వలస వెళుతున్న కూలీలు

పొట్ట చేతపట్టుకుని వలసలు పోతుంటే..ఊళ్లు ఖాళీ అవుతున్నాయి

గోనెగండ్ల మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు చేతికి అందక పోవడంతో స్థానికంగా వ్యవసాయ కూలీ పనులు కరువయ్యాయి. దీంతో వ్యవసాయ కూలీలు, రైతు కుటుంబాలు చేసేదేమీ లేక కర్ణాటకలోని షాపూర్, మాన్వి, తెలంగాణలోని కల్వకుర్తి, నల్గొండ, జనగామ, సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్లు, వరంగల్, జడ్చర్ల, నాగర్ కర్నూల్ వంటి ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బ్రతుకు తెరువు కోసం, రైతులు వేసిన పంటల పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చుకోవడం కోసం, వ్యవసాయ కూలీలకు రోజువారీ కూలీ పనులు లేక వలసబాట పట్టారు.

- Advertisement -

గత 20 రోజుల నుంచి వలసలు అధికమయ్యాయి. మండల కేంద్రమైన గోనెగండ్లతో పాటు ఎర్రబాడు, బైలుప్పల, పెద్ద మరి వీడు, పెద్ద నేలటూరు గ్రామాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు వెయ్యి కుటుంబాలకు పైగా వివిధ వాహనాల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు పిల్లాపాపలతో కలిసి మూట ముల్లె సర్దుకుని బయలుదేరారు. వీరితో పాటు చదువుతున్న విద్యార్థులను కూడా తీసుకెళుతున్నారు. గ్రామాల్లోని వీధులన్నీ జన సంచారం లేక బోసిపోయాయి .
వలసలను నివారించాల్సిన అధికారులు ఉపాధి పనులు కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు మండలంలోని గ్రామాలలో ఉపాధి పనులు చూపించి వలసలను నివారించాలని ప్రజలు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News