Melioidosis outbreak in Guntur : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తురకపాలెంలో ‘మెలియాయిడోసిస్’ అనే అరుదైన, ప్రమాదకరమైన వ్యాధి వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వార్త తెలియగానే, ప్రభుత్వం అప్రమత్తమై, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అసలు ఏమిటీ మెలియాయిడోసిస్..? ఇది ఎలా వ్యాపిస్తుంది..? దీని లక్షణాలేంటి? ఈ వ్యాధి బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఏమిటీ ‘మెలియాయిడోసిస్’ : ఇది ‘బర్ఖోల్డేరియా సూడోమల్లె’ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఒక అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా కలుషితమైన మట్టి, నీటిలో సంవత్సరాల పాటు జీవించగలదు.
ఎలా వ్యాపిస్తుంది : ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి నేరుగా సోకదు. కానీ, కలుషితమైన మట్టి, నీరు, గాలితో సంపర్కం ద్వారా వ్యాపిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెబుతోంది. ముఖ్యంగా, శరీరంపై ఉన్న గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియా సులభంగా లోపలికి ప్రవేశిస్తుంది.
వర్షాకాలంలోనే అధికం: ఇది ప్రధానంగా రుతుపవనాల ఆధారిత వ్యాధి. సుమారు 75-85% కేసులు వర్షాకాలంలోనే నమోదవుతాయి.
ప్రమాదం ఎవరికి ఎక్కువ : ఈ వ్యాధి అందరిపై ఒకేలా ప్రభావం చూపదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మధుమేహం (డయాబెటిస్) అధికంగా మద్యం సేవించేవారు కాలేయ, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు. క్యాన్సర్, తలసేమియా బాధితులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
“పశువులలో ఈ వ్యాధిని గుర్తిస్తే, అది మనుషులకు ముందస్తు హెచ్చరికగా పనిచేస్తుంది. వర్షాల తర్వాత పర్యావరణ నమూనాలను, అనుమానిత జంతువులను పరీక్షించడం ద్వారా మనుషులకు వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు.”
– ప్రొఫెసర్ డాక్టర్ పి. ఆనంద్‌కుమార్, ఎన్టీఆర్ పశువైద్య కళాశాల, గన్నవరం
లక్షణాలు ఎలా ఉంటాయి : ఈ వ్యాధి లక్షణాలు చాలా విస్తృతంగా ఉంటాయని, ఒక్కోసారి న్యుమోనియా, సెప్టిసిమియా (రక్తంలో ఇన్ఫెక్షన్) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా కనిపించే లక్షణాలు: జ్వరం, తలనొప్పి, అలసట, దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కీళ్ల నొప్పి, శరీరంపై చీము గడ్డలు, పుండ్లు ఏర్పడటం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఈ వ్యాధికి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో లేదు. నివారణే శ్రీరామరక్ష. కలుషితమైన నీటిని తాగవద్దు. నీటిని ఎల్లప్పుడూ కాచి, వడపోసి తాగాలి.
చర్మంపై గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు మట్టిలో, మురికి నీటిలో పనిచేయకపోవడం మంచిది. రైతులు, వ్యవసాయ కూలీలు గ్లౌజులు, బూట్లు ధరించాలి. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పైన చెప్పిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


