Anitha| గత వైసీపీ ప్రభుత్వంలో జగన్(YS Jagan) రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని హోంమంత్రి అనిత(Vangalapudi Anitha) తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని జగన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విమర్శలపై అనిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ హయాంలో ఏమి జరిగిందో ప్రజలు మర్చిపోలేరని చెప్పారు. అందుకే 11 సీట్లు ఇచ్చి ఘోరంగా ఓడించారని సెటైర్లు వేశారు.
జగన్ పాలనలో రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేశారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఎన్ని నేరాలు జరిగినా జగన్ ఐదేళ్లపాటు కనీసం పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏదో అయినట్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. క్రిమినల్‌కు కులం, మతం, ప్రాంతం, పార్టీ ముసుగు ఎందుకు? అని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి (Varra Ravindra Reddy).. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, తనపై దారుణమైన పోస్టులు పెట్టాడని గర్తు చేశారు. సొంత తల్లి, చెల్లిని వైసీపీ కార్యకర్తలే తిడుతుంటే జగన్‌కు పౌరుషం రాలేదా? అని నిలదీశారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉందన్నారు. ఇలాంటి నీచమైన పోస్టులు పెట్టిన వారిని వదిలేయమంటారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అర్థవంతమైన విమర్శలు చేయాలని.. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి పిచ్చి పనులు చేసేవారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏమిటో జగన్‌కు తెలుసా? అని నిలదీశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని మంత్రి అనిత హెచ్చరించారు.