నవంబర్ నెలలో తిరుమల(Tirumala) శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 111 కోట్ల 97 లక్షల రూపాయలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక స్వామివారికి 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించగా.. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు.. అలాగే, 19,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా కేటాయించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ప్రత్యేక దర్శనాలను జనవరి 10వ తేది ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని భక్తులను, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు.